
సాక్షి, కరీంనగర్: వరి ధాన్యం కొనే విషయంలో కేంద్రం మెడలు వంచే వరకూ పోరాడుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేంద్రం కడుపు మండీ కళ్ళ మంటతో పచ్చటి తెలంగాణలో చిచ్చు పెడుతుందని విమర్శించారు. కాగా యాసంగి వడ్లను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా కేంద్ర వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా గోపాల్‌పూర్ కమాన్‌పూర్‌లలో జరిగిన రైతుల ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ నల్ల రంగు దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని మంత్రి మండిపడ్డారు. వడ్లు కొనకుండా తప్పించుకోవాలని చూస్తే రాష్ట్రంలో బీజేపీకి పూర్తిగా నూకలు చెల్లినట్లేనని మంత్రి గంగుల హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం వరి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని, కానీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు చెబుతూ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని చెప్పారు. కేంద్రం దిగి వచ్చే వరకూ తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిపై ఈ నెల 8న నల్లజెండాలు పెట్టుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేయాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment