సాక్షి,ఢిల్లీ : కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 272 మార్క్ దాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుని బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తాజాగా, కేబినెట్ సభ్యులు, సహాయ మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. వారికి శాఖల కేటాయింపు సైతం పూర్తయింది. ఇక, లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఎనిమిది రోజులపాటు కొనసాగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జూన్ 24 నుంచి 25 ఈ రెండు రోజుల పాటు కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎంపిక జరగనుంది.
స్పీకర్ రేసులో ఎవరున్నారంటే?
రాజస్థాన్ కోట లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత ఓం బిర్లా 2019 నుంచి 2024 వరకు లోక్‌సభకు 17వ స్పీకర్‌గా పనిచేశారు. అయితే ఇటీవల సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో లోక్‌సభకు 18వ స్పీకర్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన ఓం బిర్లా స్థానంలో కొత్తగా ఎన్నికైన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పార్లమెంట్ సభ్యులను లోక్‌సభ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం టీడీపీ,ఏపీ బీజేపీ, జేడీయూ పోటీపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment