సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో తాను పదేళ్ల అనుభవం సాధించానని, అందువల్ల సీఎం పదవిని చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వారాహి యాత్ర మూడో విడత ముగింపు సందర్భంగా శుక్రవారం విశాఖలోని ఓ హోటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏ రంగంలోనైనా పరిణతి చెందాలంటే కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. నాకు రాజకీయాల్లో పదేళ్ల అనుభవం వచ్చింది. సీఎం పదవికి సిద్ధమయ్యా. అయితే అదొక్కటే సరిపోదు.
ఎన్నికలయ్యాక సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. నాతో ఏ పార్టీలు కలిసొస్తాయన్నది ఆలోచిస్తున్నా. అందుకే ఈ ప్రక్రియలో ఓటు చీలకూడదన్నది నా అభిమతం’ అని చెప్పారు. టీడీపీతో పొత్తుపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యేది జనసేన – బీజేపీ ప్రభుత్వమా? లేక టీడీపీ – జనసేన మిశ్రమ ప్రభుత్వమా? అన్న దానిపై తేలాల్సి ఉందన్నారు. వైఎస్సార్ సీపీ పాలనతో పోల్చుకుంటే అవినీతి, అక్రమాలు తక్కువనే ఉద్దేశంతో టీడీపీకి మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు.
మందుబాబులకు స్టైపెండ్ ఇస్తా..
రాష్ట్రంలో పోలీసు అధికారులు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారని పవన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం లేదా నియంత్రణపై దృష్టి సారిస్తామన్నారు. డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి మందుబాబులకు స్టైపెండ్ ఇస్తామని మేనిఫెస్టోలో పెడతామన్నారు.
సమాధానం చెప్పలేక అసహనం..
175 నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా, మీ బలాన్ని చాటుకోకుండా మీరు ముఖ్యమంత్రి పదవిని ఎలా ఆశిస్తారు? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పవన్ సమావేశం నుంచి నిష్క్రమించారు. సినిమాల్లో పాత్రలను పోషించిన మాదిరిగా పదేళ్ల అనుభవంతో సీఎం పోస్టుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురవేస్తామన్నారు కదా..! మరి అక్కడి నుంచి పోటీ చేస్తారా? అని మరో విలేకరి ప్రశ్నించగా.. అది తర్వాత చూద్దామంటూ దాటవేశారు.
ఎర్రమట్టి దిబ్బల పరిసర గ్రామాల్లో స్థలాలను టీడీపీ హయాంలోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారని, మరి మీరు ఈ ప్రభుత్వంపై ఆరోణలు చేయడం ఏమిటి? క్షేత్ర స్థాయిలో జరిగిన విషయాలపై మీకు అవగాహన లేదా? అని మరో విలేకరి ప్రశ్నించగా.. పవన్ సమాధానం చెప్పకుండా చిరాకు ప్రదర్శించారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఏం చేయబోతున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా ‘నువ్వు స్టీల్‌ప్లాంట్ నుంచి వచ్చావా?’ అని పవన్ ఎదురు ప్రశ్న వేశారు. ఓ ఆంగ్ల దినపత్రిక నుంచి వచ్చానని చెప్పగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులను సమకూర్చలేకపోయిందంటూ పవన్ సమాధానాన్ని దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment