
పవన్ కళ్యాణ్
ఇప్పుడు బాధితుల పేరుతో పవన్ చెక్కులు ఇచ్చిన 39 మందిలో ఆ రోజు సభకు భూములిచ్చిన వారిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
సాక్షి, అమరావతి: మంగళగిరిలో నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామానికి చెందిన 39 మందికి రూ.లక్ష చొప్పున ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పవన్ చెక్కులు అందజేసిన 39 మందిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములు ఇచ్చిన వారెవరూ లేకపోవడం విశేషం.
ఇప్పటంలో రోడ్డు ఆక్రమించుకున్నారని అధికారులు 53 మందికి నోటీసులిచ్చారు. ఒకరు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో మిగతా 52 మంది ప్రహరీలను మాత్రమే కూల్చివేశారు. ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. అయితే మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములిచ్చినందునే ఇళ్లు కూల్చి వేశారని పవన్ నానా యాగీ చేస్తున్నారు. ఇప్పుడు బాధితుల పేరుతో పవన్ చెక్కులు ఇచ్చిన 39 మందిలో ఆ రోజు సభకు భూములిచ్చిన వారిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
జనసేన ఆవిర్భావ సభను ఇప్పటంలో 6.70 ఎకరాల్లో నిర్వహించామని ఆ పార్టీ నేత నాదండ్ల మనోహర్ చెప్పారు. వింటా సాంబిరెడ్డి, తిరుమలశెట్టి సామ్రాజ్యం, ఎల్.ఆదినారాయణ, గాజుల సాంబయ్య, శంకరశెట్టి శ్రీనివాసరావు, శంకరశెట్టి పిచ్చయ్య, శంకరశెట్టి రాయుడు, ఉమామహేశ్వరరావు, గాజుల నరసయ్యల భూమి అది. (క్లిక్ చేయండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా?)
ఇందులో 8 మంది పేర్లు ఆక్రమణల జాబితాలోనే లేవు. వాళ్లలో ముగ్గురు అసలు ఆ గ్రామంలోనే ఉండరు. ఇంకొకరు ఆక్రమణల పరిధిలోకి వచ్చినా, అతడు ముందే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అతని ప్రహరీని తొలగించలేదు. అయితే ఆదివారం పవన్ చెక్కులు పంపిణీ చేసిన వాళ్లలో వీళ్లెవరూ లేరు. ప్రహరీలు తొలగించిన రోడ్డులో ఇల్లు లేని వారికి, నోటీసులు కూడా అందుకోనివారికి చెక్కులు పంపిణీ చేశారని ఇప్పటం గ్రామస్తులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: జన సైనికులే 420లు.. న్యాయస్థానమే తప్పు పట్టినా మారరా?)