ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనలు సత్యదూరంగా ఉన్నాయి. ప్రజల్లో సానుభూతి పొందేందుకు పూర్తిగా అబద్దాలను, అసత్యాలను వల్లె వేసినట్టు కనిపిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ మాట మాట్లాడినా.. దానికి ఆధారాలుంటాయి, గతంలో చేసిన ప్రకటనల రెఫరెన్స్ ఉంటుంది. ఆ విషయాలను మరిచిపోయిన పవన్ కల్యాణ్.. యధాలాపంగా తనకు తోచిన విషయాన్ని నమ్మించేలా చెప్పడానికి ప్రయత్నించి ప్రజలకు దొరికిపోతున్నారు.
నిన్న మొన్నటి వరకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాలేనని, దానికి సరిపడా సమీకరణాలే లేవని చెప్పాడు. ఆ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలని అభ్యర్థించాడు కూడా. అదేంటో కానీ ఇప్పుడు కొత్తగా "నేనే సీయం" అన్న నినాదం మళ్లీ పవన్‌కళ్యాణ్‌కు గుర్తుకొచ్చింది. అంటే మొన్న చెప్పింది ప్రజలు కచ్చితంగా మరిచిపోయి ఉంటారన్నది పవన్ కల్యాణ్ నమ్మకంలా కనిపించింది.
ఇప్పటివరకు సొంతంగా పోటీ చేస్తానన్న దానిపై తనకే నమ్మకం లేని పవన్ కల్యాణ్.. ఎలాగోలా పోటీ అయితే చేస్తానని, అసెంబ్లీకి కూడా వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో గత ఎన్నికల గురించి ప్రస్తావించారు. తాను ఓడిపోయానని నిజాయతీగా ఒప్పుకున్నా బాగుండేది కానీ, దీని వెనక ఏదో కుట్ర జరిగిందని సరికొత్తగా ట్విస్టు ఇచ్చే ప్రయత్నం చేసి నవ్వులపాలయ్యారు.
పవన్ కళ్యాణ్ : ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తా. గత ఎన్నికల సమయంలో అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదని, నాపై కక్షగట్టి.. నేను పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఓడించారు. ఆ రెండు చోట్లా ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు, వాటికి సంబంధించి భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన లెక్కలు ఒకసారి పరిశీలించి నిజమేంటో చూద్దాం. ముందుగా భీమవరం విషయానికి వస్తే..
ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం భీమవరంలో 246424 మంది ఓటర్లు 2019 నాటికి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 77.94% పోలింగ్ జరిగింది. అంటే 192061 మంది ఓటేశారు. ఎన్నికల సంఘం ప్రకారం ఇక్కడ ఇంకా 50403 మంది అసలు ఓటే వేయలేదు. అంటే పవన్‌కళ్యాణ్ చెప్పిన ఎక్కువ ఓట్లు లెక్క పూర్తిగా అబద్దమే కదా.
ఇక గాజువాక విషయానికి వస్తే.. ఇక్కడ ఏకంగా ఓటేయని వారి సంఖ్య 110727. గాజువాకలో మొత్తం ఓటర్లు 310011. ఇక్కడ 64.28% పోలింగ్ జరిగింది. అంటే 1,99,284 మంది మాత్రమే ఓటేశారు. ఎన్నికల సంఘం ప్రకారం ఇక్కడ ఇంకా 110727 మంది ఓటేయలేదు. అంటే ఇక్కడకూడా పవన్‌కళ్యాణ్ చెప్పింది అసత్యమే అని ఈసీ ఇచ్చిన డాటా నిరూపిస్తోంది.
సానుభూతి కోసం చేసే ఇలాంటి ప్రకటనల వల్ల క్రెడిబిలిటీ పెరగకపోగా.. అసలుకే మోసం వచ్చే ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రయత్నం చేసి ఇబ్బంది పడ్డారని, ఇప్పటికీ అదే ధోరణీ అనుసరిస్తే.. మరింత దెబ్బ తింటారంటున్నారు.
::: పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
ఇదీ చదవండి: జనసేనానివి సొల్లు కబుర్లు
Comments
Please login to add a commentAdd a comment