తాడేపల్లిగూడెం అర్బన్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు ప్రాణహాని ఉందని ఎందుకన్నారో తెలియదుగానీ అయితే అది చంద్రబాబు నుంచే ఉందని గ్రహించాలని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. ‘తమ్ముడూ పవన్.. చంద్రబాబుపై ఓ కన్నేసి ఉంచు! ఆయన్ను ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరించారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
టీడీపీ అధికారంలో ఉండగా పేదల నాయకుడు వంగవీటి మోహన్‌రంగా హత్యకు పన్నాగం పన్నిన వారిలో చంద్రబాబు హస్తం ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు ఏదైనా జరిగితే ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీ పైకి నెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతు లాంటి చంద్రబాబును విశ్వసిస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్ వెనుక తిరుగుతున్న వారంతా తమ పరిస్థితి కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు అవుతుందని భయపడుతున్నట్లు చెప్పారు.
పవన్ సీఎం అభ్యర్థి అని ప్రకటిస్తారా?
స్థిరత్వం లేని మాటలతో ప్రజల్లో చులకన కావద్దని పవన్‌కు మంత్రి సత్యనారాయణ హితవు పలికారు. గతంలో తనకు ముఖ్యమంత్రి అయ్యే సీన్ లేదన్న పవన్ ఇప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించగలరా? అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. మహానాడు అట్టర్ ఫ్లాప్ కావడంతో కాపు సామాజికవర్గం ఓట్ల కోసం పవన్ కల్యాణ్‌ను పావులా వాడుకుంటున్నారని చెప్పారు. సొంతంగా పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులతో పోటీ చేయించాలన్నారు.
జగన్ పాలనలో ప్రతి ఇంటా సిరులపంట
సీఎం జగన్ పాలనలో ప్రతి ఇంటా సిరుల పంటగా ఉందని మంత్రి సత్యనారాయణ తెలిపారు. ప్రతి మహిళకూ లక్ష్మీ కటాక్షం లభిస్తోందన్నారు. పది కాలాల పాటు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే తమ కుటుంబాలు నిలబడతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. పోలవరంలో రివర్స్ టెండర్లతో రూ.1,300 కోట్లు ఆదా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
టీడీపీ పాలనలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వెలికి తీస్తుంటే శాంతి భద్రతలు లోపించాయంటూ విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలోనే దేవాలయాలను కూల్చిన విషయం పవన్‌కల్యాణ్ తెలుసుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రూ.281 కోట్లతో 250 దేవాలయాల పునర్నిర్మాణంతోపాటు 5,000 దేవాలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా మరో 2,000 ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment