అను‘మతి’ లేని పవన్‌ కళ్యాణ్‌ పర్యటన   | Pawan Kalyan programs without taking permissions | Sakshi
Sakshi News home page

అను‘మతి’ లేని పవన్‌ కళ్యాణ్‌ పర్యటన

Published Wed, Apr 3 2024 5:12 AM | Last Updated on Wed, Apr 3 2024 12:15 PM

Pawan Kalyan programs without taking permissions - Sakshi

అనుమతులు తీసుకోకుండానే పవన్‌కళ్యాణ్‌ కార్యక్రమాలు

అధికారులు అడ్డుకుంటే సింపతీ కోసం ప్రభుత్వంపై నెట్టేందుకు విఫల యత్నం

చర్చిలో కార్యక్రమానికి జనం కరువు

పిఠాపురం: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో చిన్న సమావేశం పెట్టుకోవాలన్నా ఎన్ని­కల అధికారుల అనుమతి తప్పనిసరి. అలాంటిది జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి ముంద­స్తు అనుమతులు తీసుకోకుండా పర్యటిస్తూ.. అధి­కారులు అడ్డుకుంటే ప్రభుత్వంపై నెపాన్ని నెడు­తూ సానుభూతి పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశమయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన నాలుగో రోజు మంగళవారం నిబంధనలకు విరుద్ధంగా సాగడంతో ఎన్నికల అధికారులు అడుగడుగునా అడ్డుకున్నారు.

పవన్‌ తొలుత పిఠాపురం ఏబీసీ చర్చిలో ప్రార్థనలకు వచ్చారు.  ఆ చర్చి పాస్టర్లు తప్ప ఎవరూ హాజరు కాలేదు. దీంతో మొక్కుబడిగా ప్రార్థనలు పూర్తిచేసుకున్న పవన్‌ అక్కడి నుంచి కొత్తపల్లి మండలం పొన్నాడ శివా­రు బషీర్‌బీబీ దర్గాకు చేరుకుని ప్రార్థనలు చేశారు.  అనంతరం రోడ్డు షోగా బయలుదేరి యు.కొత్తపల్పిలోని ఒక ఫంక్షన్‌ హాలులో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు.

ఇంతలోనే అక్కడికి ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది చేరుకొని సమావేశం నిర్వహణకు అనుమతి పత్రాలు చూపించాలని కోరారు. దీంతో జనసేన నేతలు నీళ్లు నమిలారు. అధికారులు అడ్డుకోవడంతో చేసేదేమీ లేక  త్వరలోనే మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పి అక్కడి నుంచి పవన్‌ వెళ్లిపోయారు.

తోసేస్తున్నది బౌన్సర్లే
తన పైన, తన సెక్యూరిటీ పైన కొందరు అల్లరి మూకలు బ్లేడ్లతో దాడి చేస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని పవన్‌ సోమవారం వ్యాఖ్యానించారు. అయితే పవన్‌ పర్యటనలో అడుగడుగునా ఆయన అనుచరులు, బౌన్సర్లు జనంతో తీవ్ర ప్రతిఘటనకు దిగుతూ బలవంతంగా తోసేస్తున్నారు.  దీంతో పలువురు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి.

 కాగా, పవన్‌ మంగళవారం పర్యటన వివరాలు అంటూ జనసేన అధికారికంగా షెడ్యుల్‌ ప్రకటించింది. దీని ప్రకారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే  గంటగంటకూ మార్పులు చేసుకుంటూ అసలు ఆయన ఎక్కడ ఆగుతారో.. ఎక్కడకు వెళతారో తెలియని అయోమయ పరిస్థితులు సృష్టించారు. దీంతో పోలీసులు  అవస్థలుపడ్డారు.

పగలు పిఠాపురం.. రాత్రి హైదరాబాద్‌
పవన్‌  నాలుగు రోజుల పర్యటన పగలు పిఠాపు­రం.. రాత్రి హైదరాబాద్‌ అన్నట్టుగా కొనసాగడం చర్చనీయాంశమైంది. ప్రతి రోజూ మధ్యాహ్నం వరకూ మాత్రమే పిఠాపురంలో ఉండి, రాత్రికి హైదరాబాద్‌కు స్పెషల్‌ ఫ్‌లైట్‌లో వెళ్లి వస్తున్నారు.   కాగా, పవన్‌కళ్యాణ్‌ను సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ తదితరులు పిఠాపురంలో కలుసుకున్నారు. వారితో కలసి ఆయన మళ్లీ హైదరాబాద్‌ వెళ్లిపోయారు.ప్లాన్‌ ప్రకారమే..సమావేశం ఉన్నట్టు జనసేన పార్టీ ముందు రోజే అధికారికంగా ప్రకటించింది. అటువంటప్పుడు దీనికి అనుమతి కోసం ఎందుకు దరఖాస్తు చేయలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

కావాలనే అనుమతి తీసుకోకుండా సమావేశం ఉన్నట్లు ప్రచారం చేసుకుని.. తీరా జనం ఉండగా సమావేశం ఆగిపోతే ఆ నెపం ప్రభుత్వం మీదకు నెట్టి సానుభూతి పొందేందుకు ప్రణాళిక ప్రకారమే ఇలా చేస్తున్నట్లు తెలిసింది. ఏదైనా ఎన్నికల ప్రచార సభ నిర్వహించాలనుకుంటే 24 గంటలు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని, కానీ ఈ సమావేశం కోసం జనసేన నేతలెవరూ తమకు  దరఖాస్తు చేయలేదని పిఠాపురం ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు వరప్రసాద్, వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. 

‘సాక్షి’ టీవీ విలేకరిపై దాడికి యత్నం
పవన్‌ పర్యటనలో ఆయన బౌన్సర్లు జనసేన నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. పిఠాపురం చర్చిలో ప్రార్థనలకు పవన్‌ హాజరు కాగా, అక్కడకు వచ్చిన జనసేన ఉభయ గోదావరి జిల్లాల నాయకురాలు చల్లా లక్షి్మని బౌన్సర్లు అడ్డుకుని తోసేశారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనక్కి వెళ్లిపోయారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్‌ భూషణంపై దాడి చేయడానికి బౌన్సర్లు ప్రయత్నించగా.. స్థానిక మీడియా ప్రతి­నిధులు అడ్డుకుని, ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని బౌన్సర్లను అక్కడి నుంచి పంపించేశారు.

పవన్‌కళ్యాణ్‌ పర్యటనకు వర్మ డుమ్మా
‘నా గెలుపు బాధ్యత అంతా వర్మదే. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడుచుకోండి..’ అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చెప్పి ఒక్క రోజు కూడా కాలేదు. రెండోరోజే పవన్‌ పిఠాపురం పర్యటనకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ డుమ్మా కొట్టారు. పవన్‌ పిఠాపురం, కొత్తపల్లి పర్యటనల్లో వర్మతో పాటు టీడీపీ నేతలెవరూ పాల్గొనలేదు. దీంతో ఇక్కడ పొత్తు మళ్లీ చిత్తయిందని పలువురు పేర్కొంటున్నారు.

అయితే పవన్‌ పర్యటన వివరాలు, సమాచారం తనకు తెలియజేయకపోవడం వల్లే తాను రాలేదని పిఠాపురం జనసేన ఇన్‌చార్జి, ఆ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌పై వర్మ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై ఉదయ్‌శ్రీనివాస్‌ తన అనుచరులకు క్లాస్‌ పీకి ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగకుండా చూసుకుంటామని వర్మను బతిమలాడుకున్నట్లు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement