ప్రవాసాంధ్రుడు పవన్ కల్యాణ్ సరికొత్త నాటకానికి తెరలేపారు. ఎపీవాసినని చెప్పుకోవడానికి జనసేన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి మంగళగిరికి తరలించారు. తాను ఏపీలోనే ఉంటున్నట్లు కలరింగ్ ఇవ్వడం కోసమే ఆఫీస్‌ను మార్చారని జనసేన వర్గాలే చెబుతున్నాయి. ప్రవాసాంధ్రుడి ముద్ర చెరిపేసుకోవడానికే ఈ తిప్పలని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏపీలో పవన్ నివాసం ఎక్కడ?..
రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్‌లో.. ఉండేది హైదరాబాద్‌లో అనే విమర్శలు ఇకపై రాకుండా ఉండేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి మార్చేశారు. షూటింగ్‌లు హైదరాబాద్‌లో చేసుకుంటూ.. అప్పుడప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు లారీ మీద ఏపీలో పర్యటిస్తూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడం పవన్‌కు అలవాటుగా మారింది.
ఆయన నివాసం ఒక చోట, రాజకీయాలు మరోచోట అంటూ అధికార వైఎస్‌ఆర్‌సీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తన నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయం ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి జూన్ 12న పవన్ భూమిపూజ నిర్వహించారు. రెండు నెలల్లో ఆఫీస్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. మంగళగిరి ఆఫీస్‌కు హైదరాబాద్ నుంచి సామాన్లు కూడా తరలించేశారు.
మీడియాకు లీకులు..
ఆఫీస్ తరలించడమే గాదు.. ఇక పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే నివాసముంటారని చెబుతూ మీడియాకి లీకులిచ్చారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేశారు. ఎన్నికల సమయంలో రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యాలయం కోసం ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. ఎన్నికలలో గెలిచినా.. ఓడినా ప్రజలతోనే ఉంటానని మాటిచ్చారు. భీమవరంలో పోటీ సమయంలో తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి అని.. నర్సాపురం పుట్టిల్లుగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక గాజువాకలో అయితే రెల్లి కులప్రస్తావన చేసి సెంటిమెంట్ ని పండించాలని ప్రయత్నించారు. కానీ, పవన్ వేస్తున్నది కుప్పిగంతులని గ్రహించిన ప్రజలు రెండు చోట్లా ఓడించారు. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చి నెల తిరక్కుండానే గాజువాక, భీమవరంలలో జనసేన జెండా పీకేశారు. ఇళ్ళు ఖాళీ చేసేశారు. ఆ తర్వాత ఆ రెండు చోట్లా జనానికి ముఖం చాటేశారు. మళ్లీ ఎన్నికలవేళ ఏపీలోనే నివాస ముంటున్నట్లుగా ప్రజలని నమ్మించడానికే మంగళగిరికి మకాం మార్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు అలా..
ఇకపై షూటింగ్‌ల సమయంలోమాత్రమే హైదరాబాద్ వెళ్తారని.. ఫుల్ టైం మంగళగిరి ప్రధాన కార్యాలయం నుంచే రాజకీయాలు చేస్తారని పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. గత పదేళ్లగా జనసేన పార్టీని నడుపుతున్న పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్‌లో సొంతిల్లు కట్టుకోవాలనే ఆలోచన మాత్రం చేయలేదు. దాదాపు మూడు టర్మ్‌లు ముఖ్యమంత్రిగా ఉండి.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో సొంతిల్లు కట్టుకునే ప్రయత్నం చేయలేదు. విభజన అనంతరం ఏపీ సీఎంగా ఉన్నప్పటికీ చంద్రబాబు హైదరాబాద్‌లో పెద్ద బంగ్లా నిర్మించుకున్నారే గాని సొంత ఊరిలో గాని.. అమరావతిలో గానీ ఇల్లు నిర్మించే ఆలోచన చేయలేదు. కృష్ణా నది కరకట్ట మీద అక్రమంగా కట్టిన ఇంట్లోనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన రాజకీయాలు, భవిష్యత్ అంతా ఏపీతోనే అని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగానే విభజన తర్వాత తాడేపల్లిలో సొంతిల్లు సైతం కట్టుకున్నారు.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఇపుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ఏపీలో సొంతిల్లు నిర్మించుకోవాలనే ఆలోచనలు వచ్చాయి. ఇందులో భాగంగానే ఎన్నికల ముందు ప్రజలని మభ్యపెట్టేందుకు పవన్ మంగళగిరి మకాం అంటుంటే.. కుప్పంలో సొంతిల్లు కట్టుకుంటానంటూ చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో జనం చెవిలో పువ్వు పెట్టడమంటే ఇదే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: రేపు, ఎల్లుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
Comments
Please login to add a commentAdd a comment