పవన్ పర్యటనపైనా రాజకీయ వర్గాల్లో చర్చ
14న ప్రధాని మోదీ నామినేషన్‌కు
పవన్ హాజరుఅక్కడి నుంచి హైదరాబాద్ రాక
ఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేని పవన్
రష్యా లేదా దుబాయ్ వెళ్లి ఉంటారంటున్న పార్టీ వర్గాలు
సాక్షి, అమరావతి : ఎన్నికల పోలింగ్ అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడకు వెళ్లారన్నది స్పష్టత లేకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. తాజాగా చంద్రబాబుకు దత్తపుత్రుడిగా పేరుపడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలతోపాటు సొంత పార్టీలోనూ చర్చకు దారితీసింది.
ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారంటూ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఎక్కడకు వెళ్లారన్నదీ వారికీ తెలియక సతమతమవుతున్నారు. ఈ నెల 13న మంగళగిరిలోని ఓటు వేసిన పవన్ మరుసటి రోజు 14వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత వారణాసి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు.
అప్పటి నుంచి మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గానీ, హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గానీ పార్టీ నాయకులెవరికీ అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రష్యా లేదా దుబాయ్ వెళ్లి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు తరహాలోనే పవన్ కూడా తన విదేశీ పర్యటనపై గోప్యత పాటించడంతో రాజకీయవర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాగబాబు ‘ఎక్స్’ ట్వీట్ పెను దుమారం రేపినా..
పోలింగ్ అనంతరం పవన్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ మెగా కుటుంబంలో, జనసేన పార్టీలో పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపైనా పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. పోలింగ్ ముగిసిన వెంటనే నాగబాబు ఎక్స్‌లో ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయి వాడే. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే..’ అంటూ ట్వీట్ చేశారు.
మెగా – అల్లు ఉమ్మడి కుటుంబానికి చెందిన హీరో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన మిత్రుడు, అక్కడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవి కిషోర్‌రెడ్డికి మద్దతు ప్రకటించడంతో ఆయన్ని ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ పెద్ద దుమారం రేగింది.
ఆ ట్వీట్‌పై అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగానే నాగబాబుపై తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో నాగబాబు తన ఎక్స్ అకౌంట్‌ను ఒక రోజు బ్లాక్ చేసి, రెండో రోజు ఆ ట్వీట్‌ను డిలీట్ (తొలగించానంటూ) చేశానంటూ ప్రకటించారు. ఈ వ్యవహారంపై పవన్ స్పందించకపోవడంపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment