PCC Chief Revanth Reddy Sensational Comments On CM KCR And KTR - Sakshi
Sakshi News home page

రైతులు బ్యాంకు రుణాలు చెల్లించొద్దు 

Published Sun, May 22 2022 1:18 PM | Last Updated on Mon, May 23 2022 7:37 AM

PCC Chief Revanth Reddy Comments On CM KCR And KTR - Sakshi

బొంరాస్‌పేట/కొడంగల్‌: తీసుకున్న బ్యాంకు రుణాలను రైతులెవరూ పైసా కూడా చెల్లించొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ప్రకటించిన డబుల్‌ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూమి, రూ.లక్ష రుణమాఫీ వంటి హామీలన్నీ ఉత్తివేనని, వీటిలో ఏఒక్కటీ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు.

వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండల పరిధిలోని తుంకిమెట్ల,అంగడిరాయిచూర్, చంద్రకల్, కొడంగల్‌లో ఆదివారం నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌లు ఢిల్లీ, లండన్‌ పర్యటనలు చేస్తున్నందున రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా గాలి పీల్చుకునే అవకాశం కలిగిందని, తెలంగాణ సమాజానికి ఈ స్వేచ్ఛ శాశ్వతంగా దక్కాలంటే వారిని రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

2004లో వైఎస్సార్‌ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఉద్యమ స్ఫూర్తిని విస్మరించి కేసీఆర్‌ మార్కు పాలన అమలు చేస్తున్నారని ఆరోపించారు.  

రైతు గోస పట్టడం లేదు 
ప్రతీ గ్రామం, తండాకు కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ తీసుకెళ్లాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గూడెం, గిరిజన తండాల్లో రైతు రచ్చబండ నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా వర్షాలకు మొలకెత్తిన వరి ధాన్యాన్ని రైతులు రేవంత్‌రెడ్డికి చూపించారు. తుంకిమెట్లకు చెందిన బ్యాగరి ఎల్లప్ప మాట్లాడుతూ..రైతుల గోడును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు తిరుపతిరెడ్డి, మండల నాయ కులు వెంకట్రాములుగౌడ్, నర్సిములుగౌడ్, జయకృష్ణ, రాంచంద్రారెడ్డి, రాజేశ్‌రెడ్డి పాల్గొన్నారు.  
చదవండి: ‘సార్‌’ ఊరు నుంచే ‘కారు’ పతనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement