1985 నుంచి హిందూపురంలో టీడీపీ హవా కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్‌టీఆర్ మూడు సార్లు హిందూపురం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన తనయుడు బాలకృష్ణ మూడోసారి గెలవాలని ఆపసోపాలు పడ్డారు. కానీ రెండుసార్లు గెలిపించిన ప్రజల్ని పట్టించుకోని బాలయ్యకు హిందూపురం ఓటర్లు ఈసారి గట్టిగా గుణపాఠం చెప్పారనే టాక్ నడుస్తోంది. పోటెత్తిన ఓటర్ల మనోభావాలు గమనిస్తే ఈసారి ఫ్యాన్ గిర్రున తిరిగిందనే చెబుతున్నారు.
హిందూపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటమి అంచుకు చేరారు. 2019లో రెండోసారి గెలిచిన తర్వాత గడచిన ఐదు సంవత్సరాలలో కేవలం 57 రోజులు మాత్రమే హిందూపురంలో గడిపారు. చుట్టపు చూపుగా పెళ్లిళ్లకు, పేరంటాలకు వచ్చి వెళ్లే బాలకృష్ణ అప్పుడప్పుడు తన అభిమానులపై చేయి చేసుకోవడం తప్ప హిందూపురం అభివృద్ధిపై అసెంబ్లీలో ఒక్కరోజు కూడా గళం విప్పలేకపోయారు. గెలిచిన అనంతరం పీఏలకు పెత్తనం అప్పగించడం, బాలయ్యకు హిందూపురం నియోజకవర్గం పట్ల ఏమాత్రం అవగాహన లేకపోవడం, సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో తనను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేశారు. తాజా ఎన్నికల్లో పోలైన ఓట్లను బట్టి చూస్తే కచ్చితంగా బాలకృష్ణ ఓడిపోతాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
హిందూపురంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకత్వం నియోజకవర్గం అభివృద్ధి మీద గట్టిగా కేంద్రీకరించింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన తాబేదార్లకు పెత్తనం ఇవ్వడంతో జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవడానికి అధికార పార్టీ రంగంలోకి దిగింది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ పార్టీలతో నిమిత్తం లేకుండా అందించారు.
ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు చేరాయి. పైగా ఈసారి బాలకృష్ణ మీద కురుబ దీపిక అనే మహిళను బరిలో దించారు. స్థానికురాలైన దీపిక నియోజకవర్గంలోని ప్రతీ గడపకు వెళ్ళారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమే అని భరోసా ఇచ్చారు. అటు ఎమ్మెల్యే కంటికి కనిపించకపోవడం.. ఇటు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నిత్యం ప్రజల్లోనే ఉండటంతో ప్రజలకు ఎవరేంటో పూర్తిగా అర్థమైంది.
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుతో అక్కడి పార్టీ కేడర్ కూడా విసిగిపోయింది. ఆరు నెలలకోసారి వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోయే వ్యక్తి అవసరమా అనే చర్చ మొదలైంది. నియోజకవర్గంతో సంబంధం లేని బాలకృష్ణను గెలిపించడం వల్ల స్థానిక నేతలకు గుర్తింపు లేకుండా పోయిందని.. పైగా తమకు అవకాశం రాకుండా అడ్డుకుంటున్నారనే అసంతృప్తి కూడా బాగా పెరిగింది. బాలకృష్ణ భార్య వచ్చి ప్రచారం చేసినా, బాలకృష్ణే స్వయంగా ప్రచారం చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ కార్యకర్తలు కూడా సరిగా పనిచేయలేదు. నియోజకవర్గంలోని కేడర్ అంటీముట్టనట్లుగా ఉండటంతో బాలకృష్ణ ఓటమికి బాటలు వేసినట్లైంది.
మొత్తంగా అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమ పథకాలతో హిందూపురంలో ఫ్యాన్ స్పీడ్‌కు ఎదురు లేకుండా పోయింది. తనకు హ్యాట్రిక్ విజయం సాధ్యం కాదని బాలకృష్ణకు కూడా బాగానే అర్థమైంది. అందుకే ఆఖరులో ఎమ్మెల్యే కూడా అంత యాక్టివ్‌గా ప్రచారంలో పాల్గొనలేదని టాక్ నడుస్తోంది. మొత్తం మీద 1985 నుంచి హిందూపురంలో తిరుగుతున్న సైకిల్‌కు ఈసారి పంక్చర్ తప్పదని అక్కడి ప్రజలు ఏకగ్రీవంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment