తిరుపతి ఉప ఎన్నిక: దిక్కుతోచని స్థితిలో టీడీపీ.. | People Shocked TDP In Nellore District | Sakshi
Sakshi News home page

తిరుపతి ఉప ఎన్నిక: దిక్కుతోచని స్థితిలో టీడీపీ..

Published Tue, May 4 2021 9:12 AM | Last Updated on Tue, May 4 2021 12:56 PM

People Shocked TDP In Nellore District - Sakshi

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలతో జిల్లాలో టీడీపీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న ఆ పార్టీ గడిచిన రెండేళ్లుగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించకపోగా, ఆ పార్టీని ఓడించిన ప్రజలను దూషిస్తూ, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ రాజకీయాలు చేసింది. వీటిని పట్టించుకోని ప్రజలు పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోకడలకు మరోసారి షాక్‌ ఇచ్చారు. తాజాగా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండి ఉంటే.. ఆ పార్టీ పరిస్థితి “మిడతం బొట్లు’ మాదిరిగా ఉండేది. పోటీలోకి దిగడమే కాక ఎన్నికల ప్రచారంలోనూ ఓటర్లను, ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడంతో మరోసారి కొట్టిన ఓటు దెబ్బ చెంప పెట్టు అయింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ జిల్లాలో జనాదరణ కోల్పోయింది. నానాటికి పార్టీ క్షీణదశకు చేరుకుంటుంది. సార్వత్రిక ఎన్నికలతో మొదలైన ఆ పార్టీ పతనం.. తాజాగా జరిగిన తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలతో సమాధి దశకు చేరుకుంది. రెండేళ్ల క్రితం అధికారంలో ఉన్న ఆ పార్టీ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 36 శాతం ఓట్‌ షేర్‌ను దక్కించుకుంటే.. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 32 శాతం ఓట్‌ షేర్‌కు పతనమైంది. సాధారణంగా రెండేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. కానీ ఇందుకు భిన్నంగా అధికార పారీ్టకి ప్రజాదరణ, ఓట్‌ షేర్‌ పెరగడం విశేషం.

తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలకే దిమ్మ తిరిగేలా ఫలితాలు వెలువడ్డాయి. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీకి దీటుగా ఓట్లు సాధించలేని పరిస్థితి. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ వారం రోజులకు పైగా జిల్లాలో మకాం వేసి ప్రతి నియోజకవర్గంలో రోడ్‌షోలు, డోర్‌టు డోర్‌ క్యాంపెయిన్‌లు, సమీక్షలతో నానా హడావుడి చేసినా ఓటర్లే కాదు టీడీపీ క్యాడర్‌ కూడా పట్టించుకోలేదు. పర్యవసానంగా నాలుగు నియోజకవర్గాల్లో పాస్‌ మార్కులు కూడా రాని పరిస్థితి. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ 32 శాతానికి మించి ఓట్లు దక్కించుకోలేని స్థితిలోకి ప్రధాన ప్రతిపక్షం పడిపోయింది.

ఓటు బ్యాంక్‌ పతనం 
దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీకి జిల్లాలో గట్టి ఓటు బ్యాంక్‌ ఉండేది. గతంలో అనేక దఫాలుగా ఆ పారీ్టకి అధికారాన్ని కట్టబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా, ప్రజలను, పార్టీ కేడర్‌ను గాలికి వదిలేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, తన పరిపాలన విధానంతో ప్రతి వర్గాన్ని తీవ్రంగా నష్టపరిచింది. ఈ పరిణామాలే ఆ పార్టీ శాపంగా పరిణమించారు. గెలుపోటములు ఎన్నికల్లో సర్వసాధారణమే అయినా.. టీడీపీ అధినేత నుంచి క్షేత్ర స్థాయిలో సెకండ్‌ లీడర్ల స్థాయి వరకు హుందాతనం రాజకీయాలు వదిలేశారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించపోగా, ఓడించారని ప్రజలను దుర్భాషలు, ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చే విధంగా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు, కుతంత్రాలు, సీఎంపై వ్యక్తి గత దూషణలకే ప్రాధాన్యత ఇచ్చింది.ఇవే ఆ పార్టీ పతనానికి సమాధి రాళ్లు అయ్యాయి.

రెండేళ్ల తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్, తిరుపతి ఉప ఎన్నికల్లోనూ తన పంథాను మార్చుకోకపోవడంతో ప్రజలు దిమ్మదిరిగే షాక్‌ను ఇచ్చారు. ఇన్నాళ్లు ఆ పార్టీ కోసం కష్టపడిన నేతలతో పాటు ఆదరించిన అభిమానులు దూరమయ్యారు. సార్వత్రిక ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో ఓటు బ్యాంకు కోల్పోతూ వచ్చింది. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో  టీడీపీ 2019 ఎన్నికలతో పోలిస్తే ఉప ఎన్నికల నాటికి 69,537 ఓట్లను కోల్పోయింది.

ఏ ఒక్క నియోజకవర్గంలోనూ 32 శాతానికి మించి ఓటింగ్‌ షేర్‌ దక్కని పరిస్థి«తి. ఓ వైపు కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ లేమి ఏర్పడింది. మరి కొన్నిచోట్ల నాయకుల హడావుడి తప్ప క్షేత్ర స్థాయిలో ప్రజల ఆదరణ లేకపోవడం టీడీపీ నేతలకు గట్టి షాక్‌ని మిగిల్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని సూళ్లూరుపేట, సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో టీడీపీకి 2,74,110 ఓట్లు దక్కాయి. సరిగ్గా రెండేళ్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇవే నియోజకవర్గాల్లో 2,04,573  ఓట్లు దక్కాయి. అంటే 69,537 ఓట్లు తగ్గడంపై నేతలు తలలు పట్టుకుంటున్నారు.

బీజేపీకి 30 వేలు లోపే  
జిల్లాలో జాతీయ పార్టీ బీజేపీ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఆకాశమే హద్దుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించడంతో పాటు మతతత్వ రాజకీయాలతో లబ్ధి పొందడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రజలు బలంగా తిప్పి కొట్టారు. పర్యవసానంగా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కనీసం 9 వేల ఓట్లు కూడా రాని పరిస్థితి. ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రా, తెలంగాణ బీజేపీ కీలక నేతలంతా తిరిగి మండలాల వారీగా విస్తృత ప్రచారం చేసినా కమలం వైపు ఓటర్లు కన్నెత్తి కూడా చూడలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కలిపినా 29,800 ఓట్లు దక్కాయి. సర్వేపల్లిలో 7,025 ఓట్లు, గూడూరులో 6,613, సూళ్లూరుపేటలో 8,890, వెంకటగిరిలో 7,280 ఓట్లు లభించాయి. జిల్లాలో బీజేపీకి నాయకులు లెక్కకు మించి ఉండడం విశేషం.

నేల విడిచి స్వాము చేసినా.. 
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలోకి ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ నేల విడిచి స్వాము చేసినా ప్రజలు ఆదరించలేదు. ప్రతి నియోజకవర్గంలో రోడ్‌షో, కొన్ని చోట్ల డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ నిర్వహించడంతో పాటు ప్రతి నియోజక వర్గంలోనూ సమీక్షలు నిర్వహించి పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇక ఎన్నికల ప్రారంభం నుంచే జిల్లాలో హడావుడి చేసిన టీడీపీ ముఖ్య నేతలంతా ఎన్నికలకు ముఖం చాటేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రతి నియోజకవర్గాన్ని స్థానిక ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా మాట్లాడారు. ప్రతి చోటా ఇదే ఫార్మూలా పాటించినప్పటికీ ప్రజల నుంచే కాకుండా టీడీపీ క్యాడర్‌ నుంచి కూడా స్పందన రాని పరిస్థితి.

జిల్లాలో టీడీపీ కీలక నేతలుగా చెలామణి అవుతున్న బీద రవిచంద్ర ఎన్నికలకు పూర్తిగా ముఖం చాటేయగా, జిల్లా అంతా టీడీపీకి తానే అంటూ హడావుడి చేసిన సోమిరెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో మిగిలిన నియోజకవర్గాల కంటే భారీగా ఓట్లకు గండి పడడం విశేషం. 2019లో సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి వచ్చిన ఓట్లలో 31,957, గూడూరులో 12,619, సూళ్లూరుపేటలో 3,122, వెంకటగిరిలో 21,839 ఓట్లు కంటే తగ్గాయి. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం పేరుతో భారీగా హడావుడి చేసినా కనీసం క్యాడర్‌ కూడా పట్టించుకోని పరిస్థితి. ఇక గూడూరులో మాజీ ఎమ్మెల్యే సునిల్‌కుమార్‌ అంతగా పట్టించుకోకపోవడంతో అభ్యర్థి పనబాక లక్ష్మి సొంత ప్రాంతం కావడంతో వారే పూర్తిస్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టారు. అయినా కానీ అక్కడ కూడా వర్కవుట్‌ కాలేదు. ఇక వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ నాలుగు రోజులు హడావుడి చేసి ముఖం చాటేశారు. సూళ్లూరుపేటలోని నేతలది ఇదే పరిస్థితి.

చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: చెక్కు చెదరని వైఎస్సార్‌సీపీ ఓట్‌ షేర్    
తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement