సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ పార్టీల స్టార్ ప్రచారకర్తలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలతో దుమారం రేపుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ప్రచార పర్వంలో పైచేయి సాధించేందుకు చేస్తున్న విమర్శలు వివాదాలు రేపుతున్నాయి. కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఓటర్లు, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రచార విన్యాసాలు కొన్ని సందర్భాల్లో వికటిస్తున్నాయి. గురువారం చౌటుప్పల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఏకంగా సమాధి కట్టిన ఘటన ప్రచారంలో కొత్తపోకడకు దారితీసింది.
హడావుడిగా నేతలు
అన్ని పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో క్రియాశీల కార్యకర్తలను మోహరించి ప్రతీ ఓటరును చేరుకునేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ఊరూరా విందులు జోరుగా సాగుతున్నాయి. మద్యం, శీతల పానీయాలు, చికెన్ విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సామాజిక సమీకరణాలపై అన్ని పార్టీలు దృష్టి సారించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఓటర్లను కలుసుకునే బాధ్యతను అప్పగించారు. టీఆర్‌ఎస్, బీజేపీలు ఇతర పార్టీల నుంచి చేరికల పేరిట హడావుడి చేస్తూ నేతలు కండువాలు కప్పే పనిలో తీరికలేకుండా ఉన్నారు.
చేరికలు నిరంతరంగా సాగుతుండటంతో ఎవరు పార్టీలో కొనసాగుతున్నారో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని అధికార పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో భాగంగా గ్రామాలను చుట్టబెడుతున్నారు. మండలాలు, గ్రామాలు, సామాజికవర్గాల వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఓటరు జాబితాను అన్ని పార్టీలు వడపోసి, వివరాలను క్షేత్రస్థాయిలో అందజేశాయి.
నాయకుల మాటల తూటాలు...
టీఆర్‌ఎస్ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అయన అసలు ప్రజాప్రతినిధిగానే పనికిరారని, కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చారని, అదీగాక గెలిచిన పార్టీలో కోవర్టుగా పనిచేశారని తీవ్రంగా విమర్శిస్తోంది. అదే సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపై విమర్శలు గుప్పిస్తోంది. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు బఫూన్‌లని, వారు కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని మంత్రి కేటీఆర్ విమర్శిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధానంగా సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. మంత్రులు/ ఎమ్మెల్యేలను దండుపాళ్యం బ్యాచ్‌గా, నీతి, జాతిలేని రాక్షసులుగా దుమ్మెత్తిపోస్తున్నారు. ‘అయ్య ఫాంహౌజ్ స్టార్.. కొడుకు డ్రగ్ స్టార్, అల్లుడు వెన్నుపోటు స్టార్.. సడ్డకుడి కొడుకు టానిక్ స్టార్, మిగిలింది లిటిల్ స్టార్. వీళ్లంతా బందిపోటు స్టార్స్’ అంటూ ఆరోపణలు చేయడం గమనార్హం.
టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్, బీజేపీలను ఏకిపారేస్తున్నారు. ‘ఒకరు దొంగ అయితే ఇంకొకరు గజదొంగ.. తాగడానికి గంజి లేని టీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు బెంజి కార్లలో తిరుగుతున్నారు. మంత్రులు మందు పోసే దివాలాకోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అడ్డమైన గాడిదలు టీఆర్‌ఎస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాయి’ అంటూ తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment