ఢిల్లీ: ఎన్నికల బాండ్ల వ్యవస్థ ఉండడం వల్ల విరాళాలను ఎవరు, ఎవరికి ఇస్తున్నారో తెలిసే అవకాశం ఉందని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదని ప్రధాని నరేంద్రమోదీ అంటున్నారు. ఆదివారం ఒక తమిళ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఎన్నికల బాండ్ల రద్దు అంశంపై స్పందించారు. పంచెకట్టులో ప్రధాని మోదీ ఈ ఇంటర్వ్యూకి హాజరు కావడం విశేషం.
ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందన్న అభిప్రాయంపై ప్రధాని స్పందిస్తూ... ‘‘లోపం లేకుండా ఏ వ్యవస్థా ఉండదు. బాండ్ల విషయంలో ఎదురుదెబ్బ తిన్నామని చెప్పేలా మేం ఏం చేశామో చెప్పండి. వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి అనేది బాండ్ల వల్లే తెలుస్తోంది. 2014కి ముందు ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వచ్చాయో ఏ దర్యాప్తు సంస్థలు కూడా చెప్పలేవు..
.. అలాంటిది ఎన్నికల బాండ్ల పథకం ద్వారా విప్లవాత్మక మార్పు కోసం మేం ముందడుగు వేశాం. ఈ వ్యవహారంలో ఇప్పుడు గంతులేస్తూ గర్వపడుతున్నవారు(ఇండియా కూటమిని ఉద్దేశించి..) తర్వాత పశ్చాత్తాపపడతారు. నేను చేసే ప్రతి పనిలో రాజకీయాలను చూడకూడదు. నేను దేశం కోసం పనిచేస్తాను. ఓట్లే ప్రామాణికమైతే ఈశాన్య రాష్ట్రాలకు అన్ని పనులు చేసి ఉండకూడదు కదా. ఇతర ప్రధానులంతా కలిసి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లారో నేనొక్కడినే అంతకంటే ఎక్కువసార్లు వెళ్లాను..
.. నేను రాజకీయ నాయకుడినైనంత మాత్రాన ఎన్నికల్లో గెలుపుకోసమే పనిచేయాలనేం లేదు. తమిళనాడులో మాకు లభించే ఓట్లు డీఎంకేకు వ్యతిరేకమైనవి కాదు.. అవి బీజేపీకి అనుకూలమైనవి. తమిళ ఓటర్లు ఈసారి మాకు పట్టం కడతారు’’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
.. తమిళనాడులో అపారమైన సామర్థ్యం ఉంది, దానిని వృధా చేయకూడదు. వికసిత్ భారత్ అంటే దేశంలోని ప్రతి మూల అభివృద్ధి చెందాలి. తమిళనాడు కూడా ఇందుకు ఓ కేంద్రంగా మారుతుందని నేను భావిస్తున్నా. ఇక్కడి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అద్భుతంగా పని చేస్తున్నారు’’ అని ప్రధాని మోదీ కితాబిచ్చారు. అలాగే.. తమిళ భాషపై జరిగిన రాజకీయాలపై స్పందిస్తూ.. దాని వల్ల తమిళనాడుకే కాకుండా దేశానికి కూడా నష్టం వాటిల్లిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment