ఆజాద్‌ వీడ్కోలు.. మోదీ కన్నీరు  | PM Modi Gets Emotional, Gives Tearful Send Off To Azad | Sakshi
Sakshi News home page

ఆజాద్‌ వీడ్కోలు.. మోదీ కన్నీరు 

Published Wed, Feb 10 2021 1:37 AM | Last Updated on Wed, Feb 10 2021 7:57 AM

PM Modi Gets Emotional, Gives Tearful Send Off To Azad - Sakshi

న్యూఢిల్లీ: భారతీయ ముస్లిం కావడాన్ని తాను గర్వంగా భావిస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. వచ్చేవారం పదవీ విరమణ చేయనున్న ఆజాద్‌ మంగళవారం రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీలకు అతీతంగా ఎంతోమంది నాయకుల నుంచి ఎన్నో నేర్చుకున్నానని ఆజాద్‌ వ్యాఖ్యానించారు. ప్రజాసేవలో ఆజాద్‌ చేసిన కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆజాద్‌తో పాటు జమ్మూకశ్మీర్‌కు చెందిన మరో ముగ్గురు సభ్యులు, నాజిర్‌ అహ్మద్, శంషేర్‌ సింగ్‌ మన్హాస్, మీర్‌ మొహ్మద్‌ ఫయాజ్‌ల రాజ్యసభ పదవీకాలం  15న ముగియనుంది. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్‌ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు. సొంత పార్టీ ప్రయోజనాలతో పాటు రాజ్యసభ, భారతదేశ ప్రయోజనాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు.

కరోనా సమయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆజాద్‌ తనను కోరారని, దాంతో వెంటనే అఖిలపక్ష భేటీ పెట్టానని గుర్తు చేశారు. తాను గుజరాత్‌ సీఎంగా, కశ్మీర్‌ సీఎంగా ఆజద్‌ ఉన్నపుడు తాము మాట్లాడుకునేవారమన్నారు. కశ్మీర్లో గుజరాత్‌ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన సమయంలో తనకు మొదట ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది ఆజాదేనని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తీవ్రమైన ఉద్వేగానికి గురైన ప్రధాని కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు. ‘అధికా రం వస్తుంది. పోతుంది.  కొందరికే ఆ అధికారాన్ని సరిగ్గా వినియోగించడం తెలుస్తుంది. అది ఆజాద్‌కు తెలుసు’అని అన్నారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య మాట్లాడుతూ.. ప్రజాజీవితంలో ఆజాద్‌ది నిష్పక్షపాత గళమని, ప్రతిపక్షంలోనూ, అధికార పక్షంలోనూ విలువైన సేవలందించారన్నా.

పాకిస్తాన్‌కు వెళ్లని అదృష్టవంతుడిని 
పాకిస్తాన్‌కు ఎన్నడూ వెళ్లని కొద్దిమంది అదృష్టవంతుల్లో తాను కూడా ఒకడినని ఆజాద్‌ వ్యాఖ్యానించారు. ‘పాకిస్తాన్‌లో పరిస్థితుల గురించి తెలుసుకుంటుంటే.. భారతీయ ముస్లింను అయినందుకు గర్వంగా ఉంటుంది. పొరుగుదేశాల్లోని దుష్ట శక్తులకు దూరంగా ఉన్నందుకు భారత్‌లోని ముస్లింలు గర్వపడాలి’అన్నారు. సీఎంగా తొలి బహిరంగ సభను సమస్యాత్మక సోపోర్‌ జిల్లాలో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పటికీ అది చాలామందికి అసాధ్యమైన విషయమని వ్యాఖ్యానించారు. 

ఇందిర, సంజయ్‌ల వల్లనే.. 
జమ్మూకశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణ జరుగుతుందని, కశ్మీరీ పండిట్లు తిరిగి స్వస్థలాలకు తిరిగి వస్తారని ఆశిస్తున్నానని తన ప్రసంగంలో ఆజాద్‌ పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ.. విద్యార్థిగా ఉండగానే రాజకీయాల్లో చేరానని, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, అబుల్‌ కలాం ఆజాద్‌ల గురించి చదువుకుని దేశభక్తుడిగా మారానని ఆజాద్‌ వెల్లడించారు. ప్రజాప్రతినిధిగా 41 ఏళ్ల అనుభవం తనదన్నారు. కశ్మీర్లో తాను కాలేజ్‌ విద్యార్థిగా ఉన్న సమయంలో.. ఆగస్ట్‌ 14, ఆగస్ట్‌ 15.. ఈ రెండు తేదీల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగేవన్నారు.

మెజారిటీ ప్రజలు ఆగస్ట్‌ 14వ తేదీన ఉత్సవాలు జరుపుకుంటే, తనతో పాటు మరికొందరు మాత్రం ఆగస్ట్‌ 15న జెండా పండుగ చేసేవారమన్నారు. రాజకీయంగా తాను ఈ స్థాయికి రావడానికి దివంగత నేతలు ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీ కారణమని ఆజాద్‌ తెలిపారు. దాదాపు నలుగురైదుగురు ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశానని, పలు రాష్ట్రాలకు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించానని, ఈ అనుభవాలు తనకెన్నో విషయాలు నేర్పించాయని వివరించారు. ఇతర రాజకీయ పార్టీల్లోని గొప్ప నేతలైన జ్యోతిబసు, కరుణానిధి, జయలలిత, చంద్ర శేఖర్, ములాయం సింగ్‌ యాదవ్, ప్రకాశ్‌సింగ్‌ బాదల్, జీకే మూపనార్, ఫారూఖ్‌ అబ్దుల్లా, ముఫ్తీ మొహ్మద్‌ సయీద్‌  తదితరులతో కలిసి పనిచేశానన్నారు.  

అటల్‌ నుంచి నేర్చుకున్నా 
బీజేపీ దివంగత అగ్ర నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆజాద్‌ తెలిపారు. ‘అటల్‌జీని తరచూ కలుçస్తూ ఉండమని ఇందిరాజీ నాకు, ఆమె రాజకీయ కార్యదర్శి ఎంఎల్‌ ఫోతేదార్‌కు చెప్పేవారు’అని గుర్తు చేసుకున్నారు. 1991 నుంచి 1996 వరకు ఉన్న మైనారిటీ ప్రభుత్వంలో తాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉండగా, వాజ్‌పేయిజీ విపక్ష నేతగా ఉన్నారని, ఆయన వద్ద ఎంతో నేర్చుకున్నానని వినమ్రంగా తెలిపారు. ‘ప్రభుత్వం, ప్రతిపక్షాలు.. రెండూ అంగీకరించేలా సమస్యకు పరిష్కారం ఎలా సాధ్యమో ఆ సమయంలో నేను నేర్చుకున్నాను’అన్నారు. 

ఐదు సార్లే ఏడ్చాను 
జీవితంలో 5సార్లే ఏడ్చానని ఆజాద్‌ చెప్పారు. సంజయ్‌ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల మరణాలప్పుడు, సునామీ వేళ, జమ్మూకశ్మీర్‌ సీఎంగా తాను ఉండగా కశ్మీర్లో ఉగ్రదాడిలో గుజరాత్‌ యాత్రికులు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఏడ్చానన్నారు. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా కళ్లలోకి నీళ్లు వచ్చాయి కానీ ఏడవలేదన్నారు. ఈ దేశంలో ఉగ్రవాదం అంతమవ్వాలని ఇప్పుడు దేవుడిని కోరుకుంటున్నానన్నారు. కాలేజ్‌ యూనియన్‌ ఎన్నికల్లో తనకు ఎంతోమంది కశ్మీరీ పండిట్లు మద్దతిచ్చారని గుర్తు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement