పురూలియా జిల్లాలో సభలో మమత ప్రసంగం
జాల్దా/బలరాంపూర్: తన గుండె కొట్టుకుంటున్నంత వరకూ, స్వరపేటిక పని చేస్తున్నంత వరకూ బీజేపీపై పోరాటం కొనసాగిస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. ఆమె సోమవారం పురూలియా జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో చక్రాల కుర్చీలో కూర్చొనే ప్రసంగించారు. కుట్రలు, గాయాలు తనను అడ్డుకోలేవని తేల్చిచెప్పారు. ‘కొన్ని రోజులు ఓపిక పట్టండి. నా కాలు నయమవుతుంది. మీ(బీజేపీ నేతలు) కాళ్లు బెంగాలీ గడ్డపై స్వేచ్ఛగా ఎలా తిరుగుతాయో చూస్తా’’ అని గర్జించారు. దాడిలో కాలు విరిగిపోవడంతో ఇక తాను బయటకు వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయలేనని కొందరు భావించారని చెప్పారు. కానీ, తన కాలి నొప్పి కంటే ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని స్పష్టంచేశారు.
అమిత్ షా కోరితే జనాన్ని పంపించేవాళ్లం
జనం రాకపోవడం వల్లే కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లో తొలి ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకున్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఆయన కోరితే తాము జనాన్ని పంపించేవాళ్లమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బయటి వ్యక్తులు బెంగాల్‌లో చొరబడి, అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తనకు సమాచారం అందిందన్నారు. అందుకే అంతర్రాష్ట్ర సరిహద్దును మూసివేయాలని పురూలియా జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment