భోపాల్: భోపాల్ సమావేశంలో ఉమ్మడి పౌరస్మృతిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెరమీదకు తెచ్చారు. ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో మనిషికో చట్టం ఉండటం సబబు కాదని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని గుర్తు చేశారు. భోపాల్‌లో నిర్వహించిన 'మేరే బూత్ సబ్‌సే మజ్‌బూత్' కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో మాట్లాడారు.
సమావేశంలో భాగంగా ట‍్రిపుల్ తలాక్‌పై కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో ఎవరి ప్రయోజనం కోసం ఇన్నాళ్లు ట్రిపుల్ తలాక్‌ను కొనసాగించారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈజిప‍్టు, ఇండోనేషియా, ఖతార్, జోర్డన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి ముస‍్లిం దేశాల్లో తలాక్ ఆచారాన్ని ఎప్పుడో రద్దు చేశారని గుర్తుచేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రిపుల్ తలాక్‌ను కొనసాగించారని ప్రధాని దుయ్యబట్టారు. తలాక్ రద్దు చట్టం తేవడంతో ముస్లిం స్త్రీలకు స్వేచ్ఛ కల్పించినట్లు పేర్కొన్నారు. అందుకే ఎక్కడకు వెళ్లినా బీజేపీకి ముస్లిం మహిళలు అండగా ఉంటున్నారని చెప్పారు.
తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ముస్లింలను రెచ్చగొడుతున్నారని ప్రధాని ఆరోపించారు. అలాంటి పార్టీలను దూరంగా ఉంచాలని అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను ఉద్దేశిస్తూ.. దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం అవసరాన్ని రాజ్యాంగం కూడా తెలిపిందని ప్రధాని చెప్పారు.
మతాలకతీతంగా అందరికీ ఒకే చట్టాలు అందుబాటులో ఉండేలా ఉమ్మడి పౌరస్మృతి సూచిస్తుంది. ఉత్తరఖండ్ ఇప్పటికే ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. లా కమిషన్ కూడా ఇటీవల ఈ చట్టంపై పనిచేస్తోంది. దేశంలో పలు మత సంస్థలను, ప్రముఖ వ్యక్తులను ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతిపై సూచనలను కోరింది.
ఇదీ చదవండి: కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment