సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఖాకీలు వర్సెస్ ఖద్దరు అన్నట్లు పోరు తుది అంకానికి చేరింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన పోలీస్ శాఖపై ఇటీవల కాలంలో పలు అవినీతి మరకలు వెలుగుచూడగా.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఓ సర్కిల్‌స్థాయి అధికారి అవినీతి బాగోతం బట్టబయలు కాగా సంచలనం సృష్టించింది. ఈ మేరకు దృష్టి సారించిన రాష్ట్రస్థాయి అధికారులు ప్రక్షాళనకు నడుం బిగించారు. ఇందులో భాగంగా సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పలువురిని బదిలీ చేశారు. ప్రధానంగా సస్పెన్షన్ వేటు తర్వాతే ఒక్కొక్కటిగా సమీకరణలు మారాయి. తన సన్నిహితుడిగా పేరున్న ఆ అధికారిని వైరి వర్గ నేతల ఫిర్యాదుతో సస్పెండ్ చేయడాన్ని సవాల్‌గా తీసుకున్న జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చక్కదిద్దుకునే కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బదిలీ తప్పదని గ్రహించిన ఖాకీలు కొందరు ‘ఖద్దరు’తో రాజీకి ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. (చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి)
వైరి వర్గానికి చెక్ పెట్టేలా..
తనకు సన్నిహితుడిగా ముద్రపడిన సదరు అధికారిని సస్పెండ్ చేయడం పట్ల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జీర్ణించుకోలేకపోయారు. తన పార్టీలోని వైరి వర్గంతో పాటు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు పోలీసులతో తన ఆధిపత్యానికి గండిపడుతుందని భావించిన ఆయన రాష్ట్రస్థాయిలో పక్కా స్కెచ్‌తో పావులు కదిపినట్లు సమాచారం. అధిష్టానం నుంచి ఆశీస్సులు సైతం ఉండడంతో పోలీస్‌శాఖలో వైరి వర్గానికి మద్దతిస్తున్న ఖాకీలను బదిలీ చేయించడంతో పాటు తన అనుకూల వర్గానికి పెద్దపీట వేసేలా ముందుకు సాగుతున్నట్లు జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఓ ఉన్నతాధికారి, కొందరు పోలీసుల బదిలీలతో పాటు పలువురికి పోస్టింగ్ లభించినట్లు సదరు ప్రజాప్రతినిధి అనుచర వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. త్వరలో మరో అధికారి సైతం బదిలీ కానున్నట్లు ముందస్తుగా లీక్‌లు ఇస్తున్నాయి. (చదవండి: ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు..)
బెడిసికొట్టిన రాజీయత్నాలు..
మారిన పరిస్థితుల్లో ఏం చేయలేమని గ్రహించిన పలువురు ఖాకీలు సదరు ప్రజాప్రతినిధితో రాజీయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. పట్టణానికి చెందిన సినిమా రంగంలోని ప్రముఖ వ్యక్తి ద్వారా రాయబారం నడిపినట్లు తెలిసింది. అయితే సదరు ప్రజాప్రతినిధి ససేమిరా అనడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేఖా మిల్లు ఘటనపై చర్యలు హుళక్కేనా.. ఓ సీఐ ‘ఫోర్జరీ’పై కేసు నమోదు లేనట్టేనా.. అనే అనుమానాలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. వీటికి సంబంధించి ఓ పోలీస్ అధికారిని సంప్రదించగా.. ‘ఈ రోజు, రేపు, ఇంకెప్పుడైనా బదిలీ ఆర్డర్ వస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారు.
అవినీతి మరక: గద్వాలలో ఖాకీలు వర్సెస్ ఖద్దరు
Published Tue, Aug 31 2021 10:49 AM | Last Updated on Tue, Aug 31 2021 11:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment