transfer issues
-
GO 317 : మా గోడు వినండి.. మమ్మల్ని బదిలీ చేయండి!
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రజావాణిలో భాగంగా తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు కలిసారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సర్వీసు కోల్పోవడంతో పాటు 300 కిలోమీటర్లకు పైగా దూరానికి బదిలీ చేయబడ్డామని తెలిపారు. కార్యదర్శులు ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల కింద ఏం జరిగింది? గత ప్రభుత్వం రెండేళ్ల కింద జీవో 317 తీసుకొచ్చింది. దీని వల్ల పల్లెల్లో విధులు నిర్వర్తిస్తోన్న గ్రామస్థాయి ఉద్యోగులైన పంచాయతీ కార్యదర్శులను ఏకాఏకీన దూరతీరాలకు బదిలీ చేశారు. ట్రాన్స్ఫర్లలో సుమారుగా 250 మంది పంచాయతీ కార్యదర్శులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. చట్టం ఏం చెబుతోంది? కొత్త గ్రామపంచాయతీలు.. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఏర్పడ్డాయి. చట్ట ప్రకారం గ్రామాలకు ఎలాంటి గ్రేడ్లు లేవు. అయినా నిబంధనలకు విరుద్ధంగా, చట్టంలోని అసలు ఉద్దేశ్యానికి భిన్నంగా బదిలీలకు గత ప్రభుత్వం దిగిందన్నది కార్యదర్శుల ఆవేదన. పంచాయతీరాజ్ శాఖ ఏం చేసింది? అప్పటి పంచాయతీరాజ్ కమిషనర్ రెండేళ్ల కింద ఒక ప్రోసిడింగ్ తీసుకొచ్చారు. సెప్టెంబర్ 15, 2023న వచ్చిన ప్రోసిడింగ్ 2560/CRR&RE/B2/2017 ప్రకారం గ్రేడ్లు లేవని చెప్పారు. కానీ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన GO 81,84 ప్రకారం క్యాడర్ స్ట్రెంత్‌ను పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు జరిపారు. గత ప్రభుత్వం పాత నిబంధనలను పట్టించుకోకుండా కేటాయింపు జరపడం వల్ల కార్యదర్శులు స్థానికతను శాశ్వతంగా కోల్పోవలసి వచ్చింది. దీనివల్ల పంచాయతీరాజ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని కార్యదర్శులు తెలిపారు. ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిలో ఏముందంటే? • గద్వాల జోగులాంబ జోన్ , చార్మినార్ జోన్ గ్రేడ్-1 కార్యదర్శులను మల్టీ జోన్ రెండు నుంచి మల్టీ జోన్-1 లోని బాసర జోన్, రాజన్న సిరిసిల్ల జోన్లకు కేటాయించారు. • దీనివల్ల సుమారు 125 మంది పంచాయతీ కార్యదర్శులు ఏకంగా 300 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు బదిలీ అయ్యారు. • రాజన్న సిరిసిల్ల జోన్, కాళేశ్వరం జోన్, బాసర జోన్ లోని గ్రేడ్-1, గ్రేడ్- 2 కార్యదర్శులను భద్రాద్రి జోన్‌కు బదిలీ చేశారు. • కాళేశ్వరం జోన్ లోని గ్రేడ్-2, అలాడే గ్రేడ్-3 కార్యదర్శులు సిరిసిల్ల జోన్ కి బదిలీ అయ్యారు. • దీనివల్ల 125 మంది కుటుంబాలు రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. • బదిలీ అయిన కొత్త ప్రాంతం సుదూరంలో ఉండడం వల్ల తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుందని కార్యదర్శులు వాపోతున్నారు. గత రెండేళ్లుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని ఇబ్బందులకు గురయ్యామని ముఖ్యమంత్రికి తెలిపారు. పంచాయితీ కార్యదర్శి పోస్టు అనేది గ్రామస్థాయి పోస్టు కాబట్టి తమ పట్ల మానవతా దృక్పథంతో సొంత జోనులకు లేదా సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఇవి చదవండి: TS: నేటినుంచి జీరో టికెట్ -
అవినీతి మరక: గద్వాలలో ఖాకీలు వర్సెస్ ఖద్దరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఖాకీలు వర్సెస్ ఖద్దరు అన్నట్లు పోరు తుది అంకానికి చేరింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన పోలీస్ శాఖపై ఇటీవల కాలంలో పలు అవినీతి మరకలు వెలుగుచూడగా.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఓ సర్కిల్‌స్థాయి అధికారి అవినీతి బాగోతం బట్టబయలు కాగా సంచలనం సృష్టించింది. ఈ మేరకు దృష్టి సారించిన రాష్ట్రస్థాయి అధికారులు ప్రక్షాళనకు నడుం బిగించారు. ఇందులో భాగంగా సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పలువురిని బదిలీ చేశారు. ప్రధానంగా సస్పెన్షన్ వేటు తర్వాతే ఒక్కొక్కటిగా సమీకరణలు మారాయి. తన సన్నిహితుడిగా పేరున్న ఆ అధికారిని వైరి వర్గ నేతల ఫిర్యాదుతో సస్పెండ్ చేయడాన్ని సవాల్‌గా తీసుకున్న జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చక్కదిద్దుకునే కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బదిలీ తప్పదని గ్రహించిన ఖాకీలు కొందరు ‘ఖద్దరు’తో రాజీకి ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. (చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి) వైరి వర్గానికి చెక్ పెట్టేలా.. తనకు సన్నిహితుడిగా ముద్రపడిన సదరు అధికారిని సస్పెండ్ చేయడం పట్ల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జీర్ణించుకోలేకపోయారు. తన పార్టీలోని వైరి వర్గంతో పాటు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు పోలీసులతో తన ఆధిపత్యానికి గండిపడుతుందని భావించిన ఆయన రాష్ట్రస్థాయిలో పక్కా స్కెచ్‌తో పావులు కదిపినట్లు సమాచారం. అధిష్టానం నుంచి ఆశీస్సులు సైతం ఉండడంతో పోలీస్‌శాఖలో వైరి వర్గానికి మద్దతిస్తున్న ఖాకీలను బదిలీ చేయించడంతో పాటు తన అనుకూల వర్గానికి పెద్దపీట వేసేలా ముందుకు సాగుతున్నట్లు జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఓ ఉన్నతాధికారి, కొందరు పోలీసుల బదిలీలతో పాటు పలువురికి పోస్టింగ్ లభించినట్లు సదరు ప్రజాప్రతినిధి అనుచర వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. త్వరలో మరో అధికారి సైతం బదిలీ కానున్నట్లు ముందస్తుగా లీక్‌లు ఇస్తున్నాయి. (చదవండి: ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు..) బెడిసికొట్టిన రాజీయత్నాలు.. మారిన పరిస్థితుల్లో ఏం చేయలేమని గ్రహించిన పలువురు ఖాకీలు సదరు ప్రజాప్రతినిధితో రాజీయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. పట్టణానికి చెందిన సినిమా రంగంలోని ప్రముఖ వ్యక్తి ద్వారా రాయబారం నడిపినట్లు తెలిసింది. అయితే సదరు ప్రజాప్రతినిధి ససేమిరా అనడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేఖా మిల్లు ఘటనపై చర్యలు హుళక్కేనా.. ఓ సీఐ ‘ఫోర్జరీ’పై కేసు నమోదు లేనట్టేనా.. అనే అనుమానాలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. వీటికి సంబంధించి ఓ పోలీస్ అధికారిని సంప్రదించగా.. ‘ఈ రోజు, రేపు, ఇంకెప్పుడైనా బదిలీ ఆర్డర్ వస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారు. -
టీఆర్టీ కంటే ముందే టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) నిర్వహించడానికి కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెట్ నిర్వహించకుండా పోస్టులను భర్తీ చేస్తే అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ముందుగా టెట్ నిర్వహించడంపై విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా, ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలు 8వేల వరకు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. అయితే వాటిల్లోనూ మార్పులు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ పాఠశాలల హేతుబద్దీకరణ చేపడితే పోస్టుల సంఖ్య 5వేలకు మించకపోవచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అలాగే అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే మాత్రం 12వేలకు పైగా పోస్టులు రావచ్చని వెల్లడించారు. చదవండి: (ఖజానాకు మరో రూ. 1,500 కోట్లు!) లెక్చరర్ల బదిలీలపై మంత్రి సబిత ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: డిగ్రీ లెక్చరర్ల బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘డిగ్రీ కాలేజీల్లో అర్ధరాత్రి బదిలీలు’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యా సంవత్సరం మధ్యలో, ప్రభుత్వ ఆమోదం లేకుండా ఎలా బదిలీ చేస్తారని ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ బదిలీల వ్యవహారంపై మంగళవారం ఆమె సమగ్రంగా సమీక్షించనున్నారు. మరోవైపు ఈ బదిలీల వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా స్పందించారు. బదిలీలు పొందిన లెక్చరర్లను రిలీవ్ చేయవద్దని సోమవారం ఆదేశాలు జారీచేశారు. అయితే అప్పటికే బదిలీ పొందిన లెక్చరర్లంతా కొత్త స్థానాల్లో చేరిపోయారు. దీంతో బదిలీ స్థానాల్లో చేరిన తర్వాత నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని మరికొంతమంది లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. వారిని తిరిగి పాత స్థానాల్లోకి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. -
ఆహా.. ఓహో!
రాజులను ఎంత పొగిడితే అంత లబ్ధి చేకూరేది. ఈ సత్యం గ్రహించిన డీఎస్పీ కూడా.. మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. అది కూడా ఖాకీ డ్రెస్‌లో ఉండగానే. ఏందబ్బా.. ఈయన ఇంతలా పల్లకీ మోస్తున్నాడని ఆలోచిస్తే అసలు విషయం ఆలస్యంగా అవగతమైన ప్రజలు కూడా ఆయన తీరు పట్ల ఆహా.. ఓహో అంటూ నవ్వుకున్నారు. రాయదుర్గం: స్థానిక కేటీఎస్ డిగ్రీ కళాశాలలో హెరిటేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈజే నరేష్కుమార్(జయసుమన్) రచించిన రాయదుర్గం చరిత్ర–సంస్కృతి అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటయింది. మంత్రి కాలవతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, జిల్లా అటవీ శాఖాధికారి చంద్రశేఖర్, ఆర్డీఓ రామక్రిష్ణారెడ్డి, డీఎస్పీ టీఎస్ వెంకటరమణ పాల్గొన్నారు. కార్యక్రమంలో వక్తలందరూ రాయదుర్గం చరిత్ర, రచయిత శైలిపై మాట్లాడితే.. డీఎస్పీ మాత్రం మంత్రి కాలవను పొగడ్తలతో ముంచెత్తారు. ఉప ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులు అత్యధిక ఓట్లతో గెలుపొందడం ఓ చరిత్ర అంటూ ప్రారంభించారు. అనంతరం మంత్రి పదవి, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇదే నియోజకవర్గాన్ని వరించడం ఓ చరిత్ర అన్నారు. మంత్రి కాలవ శ్రీనివాసులు నీరు చెట్టు, వరుణయాగం, శ్రీనివాస కల్యాణం, జానపద జాతర, మెగాహెల్త్ క్యాంప్ తదితర కార్యక్రమాలను నిర్వహించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. రాయదుర్గం ప్రాంతాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలే కాలవ శ్రీనివాసులు రూపంలో రాయదుర్గం ప్రాంతానికి వచ్చారని కితాబిచ్చారు. డివిజనల్ స్థాయి అధికారి హోదాలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ కిందిస్థాయి సిబ్బందికి ఆదర్శంగా నిలవాల్సిన ఆయన తీరు సమావేశంలో చర్చనీయాంశమైంది. త్వరలో డీఎస్పీల బదిలీలు ఉండటంతోనే ఈ పల్లకీ మోతకు కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. -
ఆరోగ్యశాఖలో బదిలీల గందరగోళం
– ఆన్లైన్లో ‘లాక్’ అవుతున్న వైనం – హార్డ్‌కాపీ తీసుకోవడంలో అంతరాయం – ఆందోళనలో ఉద్యోగులు.. - గడువు పెంపుపై ఆశలు అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల గందరగోళం నెలకొంది. ఆలస్యంగానైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం వచ్చిందన్న సంతోషం ఒక్కరోజులోనే ఆవిరైంది. మంగళవారం మధ్యాహ్నం బదిలీలకు సంబంధించి ‘సాఫ్ట్వేర్’ అందుబాటులోకి రావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులందరికీ సమాచారం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీల వివరాలను ఆన్లైన్లో పొందుపరచి ఐదేళ్లు గడిచిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. బుధవరాం అర్ధరాత్రి వరకూ అవకాశం ఉండడంతో పాటు 20 శాతానికి మించకుండా బదిలీలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగులంతా ఆన్లైన్ దరఖాస్తులు అందజేయడం ప్రారంభించిన తొలి రోజే సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఒకే కేడర్‌కు చెందిన పది మంది ఐదేళ్లకు పైబడి ఒకే ప్రాంతంలో పని చేస్తున్నారనుకుంటే వారంతా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ఆ కేడర్‌కు సంబంధించి అందరూ దరఖాస్తు చేసుకున్నా ఎక్కువ కాలం ఎవరు పని చేశారో అలాంటి వారిని మాత్రమే ఆన్లైన్ స్వీకరిస్తోంది. అంటే ఇద్దరిని మాత్రమే అర్హులుగా గుర్తిస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ‘లాక్’ అయిపోతోంది. ఐదేళ్లకు పైబడిన వారు దరఖాస్తు చేసుకున్నా ‘హార్డ్‌కాపీ’ రావడం లేదు. ఉద్యోగులంతా వివరాలన్నీ నమోదు చేశాక హార్డ్‌కాపీ తీసుకుని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఇక్కడి అధికారులు కూడా ఆన్లైన్ నుంచి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రధానంగా బదిలీల దరఖాస్తు కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లోనే లోపాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని దృష్టికి వెళ్లారు. ఈ నెల 24వ తేదీతోనే బదిలీల ప్రక్రియ ముగించాల్సి ఉండడంతో సాఫ్ట్వేర్ లోపాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చ సాగినట్లు ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గడువు పెంపుపై ఉద్యోగులు ఆశలు పెంచుకున్నారు.