ఆరోగ్యశాఖలో బదిలీల గందరగోళం
– ఆన్‌లైన్‌లో ‘లాక్’ అవుతున్న వైనం
– హార్డ్‌కాపీ తీసుకోవడంలో అంతరాయం
– ఆందోళనలో ఉద్యోగులు..
- గడువు పెంపుపై ఆశలు
అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల గందరగోళం నెలకొంది. ఆలస్యంగానైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం వచ్చిందన్న సంతోషం ఒక్కరోజులోనే ఆవిరైంది. మంగళవారం మధ్యాహ్నం బదిలీలకు సంబంధించి ‘సాఫ్ట్‌వేర్’ అందుబాటులోకి రావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులందరికీ సమాచారం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచి ఐదేళ్లు గడిచిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. బుధవరాం అర్ధరాత్రి వరకూ అవకాశం ఉండడంతో పాటు 20 శాతానికి మించకుండా బదిలీలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగులంతా ఆన్‌లైన్ దరఖాస్తులు అందజేయడం ప్రారంభించిన తొలి రోజే సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఒకే కేడర్‌కు చెందిన పది మంది ఐదేళ్లకు పైబడి ఒకే ప్రాంతంలో పని చేస్తున్నారనుకుంటే వారంతా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దీంతో ఆ కేడర్‌కు సంబంధించి అందరూ దరఖాస్తు చేసుకున్నా ఎక్కువ కాలం ఎవరు పని చేశారో అలాంటి వారిని మాత్రమే ఆన్‌లైన్ స్వీకరిస్తోంది. అంటే ఇద్దరిని మాత్రమే అర్హులుగా గుర్తిస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ‘లాక్’ అయిపోతోంది. ఐదేళ్లకు పైబడిన వారు దరఖాస్తు చేసుకున్నా ‘హార్డ్‌కాపీ’ రావడం లేదు. ఉద్యోగులంతా వివరాలన్నీ నమోదు చేశాక హార్డ్‌కాపీ తీసుకుని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఇక్కడి అధికారులు కూడా ఆన్‌లైన్ నుంచి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రధానంగా బదిలీల దరఖాస్తు కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లోనే లోపాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని దృష్టికి వెళ్లారు. ఈ నెల 24వ తేదీతోనే బదిలీల ప్రక్రియ ముగించాల్సి ఉండడంతో సాఫ్ట్‌వేర్ లోపాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చ సాగినట్లు ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గడువు పెంపుపై ఉద్యోగులు ఆశలు పెంచుకున్నారు.