– నేడు కడపలో జోనల్ కేడర్ ఉద్యోగులకు బదిలీలు
– రాత్రికి రాత్రే హడావుడిగా పయనం
– ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ఉద్యోగులు
– సాధారణ బదిలీలకు నేటితో ముగియనున్న గడువు
అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే జోనల్ స్థాయి కేడర్లకు బదిలీలు ముగియగా మరోసారి రీ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్‌డీ) డాక్టర్ ఎన్.దశరథరామయ్య ఆదివారం జారీ చేశారు. జోన్–4 కింద రాయలసీమ జిల్లాల్లోని స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు, పీహెచ్‌ఎన్‌లు, ఎంపీహెచ్‌ఎస్ (ఫిమేల్), ఎంపీహెచ్‌ఎస్ (మేల్), ఎంపీహెచ్‌ఈఓ, ఆఫీస్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, హెచ్‌ఈ, డిప్యూటీ డెమో, పీఎంఓఓలు, రేడియో గ్రాఫర్లు తదితర జోనల్ కేడర్ల ఉద్యోగులకు ఈనెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కడపలోని రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
అయితే ఇందులో కొన్ని కేడర్ల ఉద్యోగులకు స్థానాలు కేటాయిండంలో అక్రమాలు జరిగాయని, సీనియర్లను అలాగే ఉంచి జూనియన్లను బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రధానంగా హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సుల బదిలీ వ్యవహారం సమస్యగా మారినట్లు సమాచారం. దీంతో రీ కౌన్సెలింగ్ చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆర్‌డీ ఉత్తర్వులు జారీ చేశారు. రీజనల్ డైరెక్టర్ పరిధిలో పని చేసే సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సూపరింటెండెంట్, ఎంపీహెచ్‌ఈఓ, పీఎంఓఓ, రేడియోగ్రాఫర్స్, స్టాఫ్ నర్సులు, హెడ్‌నర్సులు, పీహెచ్‌ఎన్ (టీ)లకు మరోసారి కౌన్సెలింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు కడపలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని, సంబంధిత అధికారులు ఈ విషయాన్ని ఉద్యోగులకు చేరవేయాలని సూచించారు.
ఈ ఉత్తర్వులను అత్యవసరమైనదిగా భావించాలని పేర్కొన్నారు. కాగా రీ కౌన్సెలింగ్‌పై కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు. కొందరికి లబ్ధి చేకూర్చడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. సాధారణ బదిలీలకు సోమవారం (ఈనెల 5) గడువు ముగియనున్న నేపథ్యంలో రీ కౌన్సెలింగ్‌లో ఎలాంటి గందరగోళం నెలకొంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం కడపలో జరిగిన కౌన్సెలింగ్‌లో ఒక్క ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోనే 20 మంది వరకు హెడ్‌నర్సులు, స్టాఫ్ నర్సులు బదిలీ అయ్యారు. జిల్లాకు సంబంధించి అన్ని కేడర్లలో సుమారు 300 మంది వరకు ఉద్యోగులకు జోనల్ కేడర్‌లో బదిలీలు జరిగాయి. తాజాగా రీ కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు నేపథ్యంలో వీరంతా కడపకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికే రెండ్రోజుల పాటు కడపలో అష్టకష్టాలు పడి కౌన్సెలింగ్ ముగించుకుని వస్తే మరోసారి కౌన్సెలింగ్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ చేపడితే ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారు. కాగా రీ కౌన్సెలింగ్ విషయం రాత్రి వరకు చాలా మంది ఉద్యోగులకు తెలియని పరిస్థితి. తెలిసిన వారు కూడా హడావుడిగా రాత్రికి రాత్రే కడపకు బయలుదేరి వెళ్లారు.
వైద్య ఆరోగ్యశాఖలో రీ కౌన్సెలింగ్
Published Sun, Jun 4 2017 11:00 PM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM
Advertisement
Advertisement