GO 317 : మా గోడు వినండి.. మమ్మల్ని బదిలీ చేయండి! | Problems Of Panchayat Secretaries With Transfer Decisions | Sakshi
Sakshi News home page

GO 317 : మా గోడు వినండి.. మమ్మల్ని బదిలీ చేయండి!

Published Fri, Dec 15 2023 2:37 PM | Last Updated on Fri, Dec 15 2023 8:47 PM

Problems Of Panchayat Secretaries With Transfer Decisions - Sakshi

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రజావాణిలో భాగంగా తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు కలిసారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సర్వీసు కోల్పోవడంతో పాటు 300 కిలోమీటర్లకు పైగా దూరానికి బదిలీ చేయబడ్డామని తెలిపారు. కార్యదర్శులు ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

రెండేళ్ల కింద ఏం జరిగింది?
గత ప్రభుత్వం రెండేళ్ల కింద జీవో 317 తీసుకొచ్చింది. దీని వల్ల పల్లెల్లో విధులు నిర్వర్తిస్తోన్న గ్రామస్థాయి ఉద్యోగులైన పంచాయతీ కార్యదర్శులను ఏకాఏకీన దూరతీరాలకు బదిలీ  చేశారు. ట్రాన్స్‌ఫర్‌లలో సుమారుగా 250 మంది పంచాయతీ కార్యదర్శులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు.

చట్టం ఏం చెబుతోంది?
కొత్త గ్రామపంచాయతీలు..  పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఏర్పడ్డాయి. చట్ట ప్రకారం గ్రామాలకు ఎలాంటి గ్రేడ్లు లేవు. అయినా నిబంధనలకు విరుద్ధంగా, చట్టంలోని అసలు ఉద్దేశ్యానికి భిన్నంగా బదిలీలకు గత ప్రభుత్వం దిగిందన్నది కార్యదర్శుల ఆవేదన.

పంచాయతీరాజ్‌ శాఖ ఏం చేసింది?
అప్పటి పంచాయతీరాజ్ కమిషనర్ రెండేళ్ల కింద ఒక ప్రోసిడింగ్ తీసుకొచ్చారు. సెప్టెంబర్‌ 15, 2023న వచ్చిన ప్రోసిడింగ్‌ 2560/CRR&RE/B2/2017  ప్రకారం గ్రేడ్‌లు లేవని చెప్పారు. కానీ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన GO 81,84 ప్రకారం క్యాడర్‌ స్ట్రెంత్‌ను పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు జరిపారు. గత ప్రభుత్వం పాత నిబంధనలను పట్టించుకోకుండా కేటాయింపు జరపడం వల్ల కార్యదర్శులు స్థానికతను శాశ్వతంగా కోల్పోవలసి వచ్చింది. దీనివల్ల పంచాయతీరాజ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని కార్యదర్శులు తెలిపారు.

ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిలో ఏముందంటే?
• గద్వాల జోగులాంబ జోన్ , చార్మినార్ జోన్ గ్రేడ్-1 కార్యదర్శులను మల్టీ జోన్ రెండు నుంచి మల్టీ జోన్‌-1 లోని బాసర జోన్, రాజన్న సిరిసిల్ల జోన్లకు కేటాయించారు.
• దీనివల్ల సుమారు 125 మంది పంచాయతీ కార్యదర్శులు ఏకంగా 300 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు బదిలీ అయ్యారు.
• రాజన్న సిరిసిల్ల జోన్, కాళేశ్వరం జోన్, బాసర జోన్ లోని గ్రేడ్-1, గ్రేడ్- 2 కార్యదర్శులను భద్రాద్రి జోన్‌కు బదిలీ చేశారు.
• కాళేశ్వరం జోన్ లోని గ్రేడ్‌-2, అలాడే గ్రేడ్-3 కార్యదర్శులు సిరిసిల్ల జోన్ కి బదిలీ అయ్యారు.
• దీనివల్ల 125 మంది కుటుంబాలు రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.
• బదిలీ అయిన కొత్త ప్రాంతం సుదూరంలో ఉండడం వల్ల తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు దూరంగా  ఉండాల్సి వస్తుందని కార్యదర్శులు వాపోతున్నారు. 

గత రెండేళ్లుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని ఇబ్బందులకు గురయ్యామని ముఖ్యమంత్రికి తెలిపారు. పంచాయితీ కార్యదర్శి పోస్టు అనేది గ్రామస్థాయి పోస్టు కాబట్టి తమ పట్ల మానవతా దృక్పథంతో సొంత జోనులకు లేదా సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.
ఇవి చ‌ద‌వండి: TS: నేటినుంచి జీరో టికెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement