సమావేశంలో మంత్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్న డీఎస్పీ వెంకటరమణ, చిత్రంలో మంత్రి కాలవ
రాజులను ఎంత పొగిడితే అంత లబ్ధి చేకూరేది. ఈ సత్యం గ్రహించిన డీఎస్పీ కూడా.. మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. అది కూడా ఖాకీ డ్రెస్‌లో ఉండగానే. ఏందబ్బా.. ఈయన ఇంతలా పల్లకీ మోస్తున్నాడని ఆలోచిస్తే అసలు విషయం ఆలస్యంగా అవగతమైన ప్రజలు కూడా ఆయన తీరు పట్ల ఆహా.. ఓహో అంటూ నవ్వుకున్నారు.
రాయదుర్గం: స్థానిక కేటీఎస్ డిగ్రీ కళాశాలలో హెరిటేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈజే నరేష్‌కుమార్(జయసుమన్) రచించిన రాయదుర్గం చరిత్ర–సంస్కృతి అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటయింది. మంత్రి కాలవతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, జిల్లా అటవీ శాఖాధికారి చంద్రశేఖర్, ఆర్డీఓ రామక్రిష్ణారెడ్డి, డీఎస్పీ టీఎస్ వెంకటరమణ పాల్గొన్నారు. కార్యక్రమంలో వక్తలందరూ రాయదుర్గం చరిత్ర, రచయిత శైలిపై మాట్లాడితే.. డీఎస్పీ మాత్రం మంత్రి కాలవను పొగడ్తలతో ముంచెత్తారు. ఉప ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులు అత్యధిక ఓట్లతో గెలుపొందడం ఓ చరిత్ర అంటూ ప్రారంభించారు. అనంతరం మంత్రి పదవి, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇదే నియోజకవర్గాన్ని వరించడం ఓ చరిత్ర అన్నారు.
మంత్రి కాలవ శ్రీనివాసులు నీరు చెట్టు, వరుణయాగం, శ్రీనివాస కల్యాణం, జానపద జాతర, మెగాహెల్త్ క్యాంప్ తదితర కార్యక్రమాలను నిర్వహించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. రాయదుర్గం ప్రాంతాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలే కాలవ శ్రీనివాసులు రూపంలో రాయదుర్గం ప్రాంతానికి వచ్చారని కితాబిచ్చారు. డివిజనల్ స్థాయి అధికారి హోదాలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ కిందిస్థాయి సిబ్బందికి ఆదర్శంగా నిలవాల్సిన ఆయన తీరు సమావేశంలో చర్చనీయాంశమైంది. త్వరలో డీఎస్పీల బదిలీలు ఉండటంతోనే ఈ పల్లకీ మోతకు కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment