
అనకాపల్లి సీటు వ్యవహారం అటు జనసేనలోను.. ఇటు టీడీపీలోనూ చిచ్చు రేపింది. ఇటీవలే జనసేనలో చేరిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి సీటు కేటాయించడాన్ని జనసేన, టీడీపీలో ఆ సీటు ఆశించినవారు భగ్గుమంటున్నారు. రెండు పార్టీల్లోనూ కొణతాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జనసేనలో ఒక్కరు, టీడీపీలో ఇద్దరు కీలక నేతలు కొణతాలకు సీటు ఇవ్వడాన్ని సహించలేకపోతున్నారు. ఆయన కోసం పనిచేసేది లేదని తేల్చేస్తున్నారు. ఇంతకీ ఆ నేతలు ఎవరంటే..
రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు విడుదల చేసిన తొలి జాబితాలో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేరును ప్రకటించారు. ఆ పేరు ప్రకటించినప్పటినుంచీ అటు జనసేనలోనూ.. ఇటు తెలుగుదేశంలోనూ కొణతాలను వ్యతిరేకించేవారు బయటికొచ్చారు. ఆయనపై ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యన్నారాయణ అనకాపల్లి సీటు ఆశించారు.
గోవిందుకు సీటు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో తమ అసంతృప్తిని టిడిపి అధిష్టానంకు తెలియజేశారు. అనకాపల్లి టీడీపీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరిచేందుకు పీలా గోవిందును చంద్రబాబు అమరావతి పిలిపించి చర్చలు జరిపారు. ఈసారి జనసేనకు సహకరించాలని సూచించారు. పీలా మాత్రం తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చంద్రబాబుకు చెప్పి బయటకు వచ్చేశారు.
ఇక కొణతాల రామకృష్ణకు రాజకీయంగా బద్ధ శత్రువు అయిన దాడి వీరభద్రరావు ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరభద్రరావు తన కుమారుడు రత్నాకర్‌కు అనకాపల్లి సీటు వస్తుందని ఆశించారు. అయితే, తన శత్రువు కొణతాలకు జనసేన నుంచి సీటు ఇవ్వడంతో దాడి వీరభద్రరావు వర్గీయులు లోలోపల రగిలిపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థి అయిన కొణతాలతో కలిసి ఎలా పని చేస్తామంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కొణతాలతో తమకున్న రాజకీయ శత్రుత్వం ఈనాటిది కాదని మూడు దశాబ్దాలకు పైగా వైరం కొనసాగుతున్న సంగతిని దాడి గుర్తు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొణతాల తమపై అనేక తప్పుడు కేసులు పెట్టి వేధించారని దాడి వీరభద్రరావు మండిపడుతున్నారు.
కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలోకి రాకముందు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు తనకే వస్తుందని జనసేన నేత పరుచూరి భాస్కరరావు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే అనకాపల్లి ఎంపీ సీటు హామీతో కొణతాల జనసేనలో చేరారు. కానీ, హఠాత్తుగా ఎంపీ సీటు విషయంలో పవన్ సోదరుడు నాగబాబు తెరమీదకు వచ్చారు. ఆయన అక్కడ ఇల్లు కూడా తీసుకుని స్థానికంగా ఉంటున్నారు. దీంతో అలిగిన కొణతాలకు ఎంపీ సీటుకు బదులుగా ఎమ్మెల్యే సీటు కేటాయించారు పవన్‌కల్యాణ్. దీంతో పరుచూరి భాస్కర్ రావు ఆశలు ఆవిరయ్యాయి. తీవ్ర నిరాశకు గురైన భాస్కరరావు కార్యకర్తల సమక్షంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. పవన్ తన నిర్ణయాన్ని పునపరిశీలించాలని భాస్కరరావు వర్గీయులు విజ్ఞప్తి చేశారు.
తాము ఆశించిన అనకాపల్లి ఎమ్మెల్యే సీటు మధ్యలో వచ్చి తన్నుకుపోయిన కొణతాల రామకృష్ణపై ఆయనకు ప్రత్యర్థులుగా మారిన ఈ మూడు వర్గాల నేతలు కత్తులు నూరుతున్నారు. ఇటీవల పార్టీలో చేరిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని జనసేన నేతలు పవన్‌ను ప్రశ్నిస్తున్నారు. పదేళ్ల నుండి కొణతాల రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ప్రజలతో సంబంధాలు లేని వ్యక్తికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటూ జనసేన అధినేతను నిలదీస్తున్నారు. ఇప్పుడు ఈ మూడు వర్గాలు కొణతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవనే టాక్ అనకాపల్లిలో నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment