Political Clashes Erupted in Srikakulam TDP - Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం టీడీపీలో మూడు ముక్కలాట.. యూజ్‌ అండ్‌ త్రో పాలసీ అమలు...

Published Sat, Sep 24 2022 3:45 PM | Last Updated on Sat, Sep 24 2022 4:45 PM

Political Clashes Erupted in Srikakulam TDP - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఎమ్మెల్యే టిక్కెట్‌ మీకే ఇస్తామంటూ ఆ పార్టీ అగ్ర నేతలు ముగ్గురికి ఆశ పెడుతున్నారు. దీంతో ఎవరికి వారు తమకే టికెట్‌ వస్తుందంటూ ఊహల్లో తేలిపోతున్నారు. ఫలితంగా ఇక్కడి రాజకీయం రసకందాయంలో పడింది. వాస్తవానికి వీరి విషయంలో తమకు అలవాటైన యూజ్‌ అండ్‌ త్రో పాలసీ అమలు చేయాలని అధిష్టానం యోచిస్తోంది.  

మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి ఆ పార్టీ నేతలే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రజల మద్దతు ఉందా లేదా అన్నది పక్కన పెడితే టీడీపీ క్యాడరే ఆమెను పట్టించుకోవడం లేదు. ఈసారి ఎలాగైనా ఆమెను మార్చాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ముఖ్యంగా రూరల్‌లో కాసింత పట్టు ఉన్న గొండు శంకర్‌.. గుండ లక్ష్మీదేవిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కృష్ణయ్యపేట సర్పంచ్‌గా ఉన్నప్పటికీ గుండ ఫ్యామిలీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.

ఈసారి ఎలాగైనా తనకే టిక్కెట్‌ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. వారి నీడలో తాము ఎదగలేమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈ సారి యూత్‌కి అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పడంతో తనకే టికెట్‌ వస్తుందనే ధీమాతో గొండు శంకర్‌ ముందుకు సాగుతున్నారు. కానీ గుండ ఫ్యామిలీ ఆలోచన మరోలా ఉంది. అవసరమైతే తన కొడుకుని తీసుకొచ్చి పోటీ చేయిస్తానని గుండ లక్ష్మీ దేవి తమవారి వద్ద చెబుతున్నారు. గొండు శంకర్‌కు ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్‌ వచ్చేది లేదని, ఆయనకు అంత సీన్‌ లేదని, 2019 ఎన్నికల్లో పార్టీ కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను వెనకేసుకున్న ఆయనకెలా ఇస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు శంకర్‌ కూడా గుండ లక్ష్మీదేవి కుటుంబం వైఫల్యాలను తీవ్రంగా ఎండగడుతున్నారు. వీరిద్దరి మధ్య పోరు సాగుతుంటే తానేమీ తక్కువ కాదంటూ కొర్ను ప్రతాప్‌ అనే నాయకుడు మధ్యలోకి వస్తున్నారు. గతంలో పీఆర్‌పీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ప్రతాప్‌ను కూడా అగ్రనేతలు ఉసిగొల్పుతున్నారు. టీడీపీ మూడు ముక్కలాట లో తానున్నానంటూ సంకేతాలిస్తున్నారు.   

తగిలించి తమాషా చూస్తున్నారు
టీడీపీ అగ్రనేతలు తమ బలాన్ని పెంచుకునేందుకు ఆశావహులను ఉసిగొల్పుతున్నారు. ఎన్నికల వరకు వాడుకుని ఆ తర్వాత వదిలేద్దామనే యోచనతో రాజకీయ డ్రామా కొనసాగిస్తున్నారు. గుండ ఫ్యామిలీకి చెక్‌ పెట్టాలనే యోచనలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. పార్టీలో, రాజకీయంగా తన వర్గం కాని గుండ ఫ్యామిలీకి మరో ఛాన్స్‌ ఇవ్వకూడదనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. వాస్తవానికైతే, మొదటి నుంచి అచ్చెన్న, గుండ ఫ్యామిలీ మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయి. ఒకరినొకరు దెబ్బకొట్టుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయి.

చదవండి: (ఒక్కసారి మాట్లాడతా అంటే మార్షల్స్‌ను పెట్టి బయటకు గెంటాడు: పేర్ని నాని)

అందులో భాగంగా 2024లో గుండ ఫ్యామిలీకి టిక్కెట్‌ రాకుండా అడ్డుకోవాలని అచ్చెన్న యోచిస్తున్నట్లు పార్టీలో కూడా గట్టిగా చర్చ నడుస్తోంది. ఆ క్రమంలోనే గొండు శంకర్‌ ను ఉసిగొల్పుతున్నారని, ప్రత్యక్షంగా మద్దతు పలుకుతున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. అచ్చెన్న అండతోనే గొండు శంకర్‌ తన స్పీడ్‌ పెంచినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎంపీ రామ్మోహన్‌నాయుడు కూడా వ్యూహాత్మక వైఖరి అవలంబిస్తున్నారు. గుండ ఫ్యామిలీకి ఒకవైపు మద్దతు పలుకుతూనే, మరోవైపు ఇతర ఆశావహులకు కూడా ఆశ చూపుతున్నట్టు సమాచారం. పాము చావకుండా, కర్ర విర గకుండా రాజకీయాన్ని నెరుపుతున్నారు. కొర్ను ప్రతాప్‌ మాత్రం ఎంపీ అండ ఉందనే ధీమాతో పోటీలో తానున్నానంటూ సంకేతాలిస్తున్నారు.    

మధ్యలో కళా రాజకీయం..  
తరచూ అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు, లోపాయికారీ రాజకీయాలతో లోకేష్‌తో చెడిందనే వాదన పార్టీలో ఉంది. ఈ తరుణంలో లోకేష్‌కు కళా వెంకటరావు దగ్గరై , వర్గ రాజకీయాలను చేస్తున్నారు. అచ్చెన్న వ్యతిరేక బ్యాచ్‌ను లోకేష్‌ దగ్గరికి తీసుకెళ్లి ఓ వర్గాన్ని తయారు చేస్తున్నారు. అందులో భాగంగా అచ్చెన్నతో విభేదాలు ఉన్న గుండ ఫ్యామిలీతో సత్సంబంధాలు నెరిపి, లోకేష్‌ వద్దకు తీసుకెళ్తున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో ‘జిల్లాలో ఎవరినీ పట్టించుకోవద్దు.. నేనున్నానంటూ’ గుండ ఫ్యామిలీకి లోకేష్‌ భరోసా ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తానికి పాతపట్నంలో ఫాలో అవుతున్న ఫార్ములానే శ్రీకాకుళంలో కూడా టీడీపీ అమలు చేస్తోంది. ఎన్నికల వరకు పార్టీకి డబ్బు ఖర్చు పెట్టించుకోవాలని చూస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement