సాక్షి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. దీంతో అన్ని పార్టీలు ఉప ఎన్నికల కసరత్తును ప్రారంభించాయి. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ చండూరులో బహిరంగ సభ నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహంలో పడకుండా చూసేందుకు రేవంత్‌రెడ్డితో సభ నిర్వహించింది. మరోసారి రేవంత్ మునుగోడులో శనివారం పాదయాత్ర చేయనున్నారు.
ఉదయం 10:30 గంటలకు నారాయణపూర్‌లో పాదయాత్ర ప్రారంభించి గుడిమల్కాపూర్, తంగడపల్లి మీదుగా చౌటుప్పల్ వరకు సాగుతుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆజాదీ కా గౌరవ్ యాత్రలో భాగంగా ఈ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. చౌటుప్పల్‌లో నిర్వహించే సభలో రేవంత్ మాట్లాడనున్నారు. సభ ఏర్పాట్లను యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
టీఆర్‌ఎస్‌కు మంత్రి సారథ్యం
పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేందుకు టీఆర్‌ఎస్ రంగంలోకి దిగింది. సీఎం కేసీఆర్ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. జిల్లా, మునుగోడు నియోజకవర్గానికి చెందిన నేతలతోనూ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలకు మండలాల వారీగా బాధ్యతలను అప్పగించారు. బీజేపీ సభకంటే ముందే సీఎం కేసీఆర్‌తో బహిరంగ సభను నిర్వహించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ నెల 20న, వీలైతే 19వ తేదీనాడే నిర్వహించబోయే సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. అయితే సభ నిర్వహించే ప్రదేశం కోసం శుక్రవారం మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు మండలాల్లో పరిశీలన చేశారు.
ఇదిలా ఉంటే 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వొదంటూ నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు గతంలో మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. దీంతో మంత్రి జగదీశ్‌రెడ్డి రంగంలోకి దిగి రెండు రోజుల కిందటే నియోజకవర్గానికి చెందిన ఆయా నేతలందరిని హైదరాబాద్‌కు పిలిపించుకొని వారితో చర్చించారు. అంతర్గత కుమ్ములాటలు వద్దని, పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారికోసం అంతా పనిచేయాలని స్పష్టం చేశారు. ఇది జరిగి రెండు రోజులు గడువకముందే మళ్లీ శుక్రవారం చౌటుప్పల్ మండలం మల్కాపూర్‌లో వారంతా సమావేశమయ్యారు. కె.ప్రభాకర్‌రెడ్డి తమను ఇబ్బంది పెట్టారని, తమపై కేసులు పెట్టించారని, ఆయనకు టికెట్ ఇస్తే తాము సహకరించబోమని తీర్మానించారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి తెలియజేయాలని నిర్ణయించారు.
చౌటుప్పల్‌లో బీజేపీ సభ!
బీజేపీ ఈనెల 21వ తేదీన చౌటుప్పల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఒకవేళ 21వ తేదీన సాధ్యం కాకపోతే 29వ తేదీన బహిరంగ సభ నిర్వహించేలా ఆ పార్టీ కసరత్తు చేస్తోంది.
మండలాల వారీగా రాజగోపాల్‌రెడ్డి పర్యటన
ఉప ఎన్నికలు వస్తేనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపడుతోందని, అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీనామా చేశానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. రాజీనామా చేసి, అదే విషయాన్ని నియోజకవర్గంలో ప్రజలకు తెలియజేస్తూ పర్యటిస్తున్నారు. ప్రతి రోజు ఒక మండలంలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తన వెంట వచ్చే అనుయాయులతో సమావేశాలు నిర్వహిస్తూ ఇదే విషయాన్ని చెబుతున్నారు. తన రాజీనామాతో రాష్ట్రంలో 10 లక్షల మందికి పెన్షన్‌లు రాబోతున్నాయని, గట్టుప్పల్ మండలాన్ని ఇచ్చారని, సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారని చెబుతున్నారు. ఇలా నియోజకవర్గంలో అన్ని పార్టీలకు చెందిన నేతల విస్తృత పర్యటనలతో మునుగోడు రాజకీయం వేడెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment