మేకల కళ్యాణ్ చక్రవర్తి : ఎవరికి ఏం రాసిపెట్టి ఉంటుందో ఎవరికి తెలుసు అంటారు పెద్దలు. రాజకీయాల్లో అయితే ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చే నాయకులు ఎప్పుడు ఎలాంటి పదవులు చేపడతారో, ఏ హోదాలో ప్రజల సేవకు అంకితమవుతారో ఊహించలేని పరిస్థితి. వారికి దేశ ప్రధాని మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అసెంబ్లీ స్పీకర్లుగా, శాసనమండలి చైర్మన్లుగా, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా వివిధ హోదాల్లో పనిచేసే అవకాశం దక్కుతుంది.
ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఏది దక్కినా రాజకీయ నాయకుడిగా విజయవంతమైనట్టే. ఇక మంత్రి హోదాలు అదనం. ఇలాంటి రాజకీయ నేతల జాబితా తెలంగాణలో చాంతాడు కంటే పొడవుగానే ఉందని చరిత్రను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది.
పీవీది ప్రత్యేక స్థానం
రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పీవీ నర్సింహారావు దేశంలో అత్యున్నత రాజకీయ పదవులు అనుభవించారు. తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిన మంథని నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీవీ.. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహా్మనందరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా కూడా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోని హనుమకొండ, నంద్యాలతోపాటు మహారాష్ట్రలోని రాంటెక్, ఒడిశాలోని బరంపురం లోక్‌సభ స్థానాల నుంచీ పీవీ గెలుపొందారు. ఇక, ఆ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పలు హోదాల్లో రాష్ట్ర, దేశ ప్రజలకు సేవచేసిన జాబితాలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఆయన కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్ ఎంపీగా, సిద్ధిపేట, గజ్వేల్ ఎమ్మెల్యేగా, కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన ఆయన రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు.
జాబితా చాలా పెద్దదే..
పలు చట్టసభల్లోకి ప్రవేశించిన నేతల్లో తెలంగాణకు చెందిన చాలా మంది ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారిని ఒక్కసారి పరిశీలిస్తే కిషన్‌రెడ్డి (ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర కేబినెట్ మంత్రి), ధర్మపురి శ్రీనివాస్ (ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి), సురేశ్òÙట్కార్ (జహీరాబాద్ ఎంపీ, నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే), సత్యవతి రాథోడ్ (డోర్నకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి), మాలోతు కవిత (మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ)లు పలు పదవుల్లో పనిచేశారు. సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీతోపాటు అదే జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారు. సోయం బాపూరావు, గెడం నగేశ్, రమేశ్ రాథోడ్‌లు కూడా ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి (మిర్యాలగూడ ఎంపీ, ఎమ్మెల్సీ, శాసనమండలి చైర్మన్‌గా), అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా, పాతబస్తీలో ఎమ్మెల్యేగా పనిచేశారు.
తమ్మినేని వీరభద్రం (ఎంపీ, ఎమ్మెల్యే) పువ్వాడ నాగేశ్వరరావు (ఎంపీ, ఎమ్మెల్సీ), భట్టి విక్రమార్క (ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే), టి. జీవన్‌రెడ్డి (జగిత్యాల ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా), కె.ఆర్.సురేశ్‌రెడ్డి (ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్, రాజ్యసభ ఎంపీ), షబ్బీర్‌అలీ (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి), బాలాగౌడ్ (నిజామాబాద్ ఎంపీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్), ఆకుల లలిత (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ), జువ్వాది చొక్కారావు (ఎమ్మెల్యే, ఎంపీ), చెన్నమనేని విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి), కెప్టెన్ లక్ష్మీకాంతరావు (ఎమ్మెల్యే, ఎంపీ), బాగారెడ్డి (ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్రమంత్రి), సోలిపేట రాంచంద్రారెడ్డి (ఎమ్మెల్యే, రాజ్యసభ ఎంపీ), దేవేందర్‌గౌడ్ (ఎమ్మెల్యే, మంత్రి, రాజ్యసభ ఎంపీ), పట్నం మహేందర్‌రెడ్డి (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రి), డాక్టర్ కె.లక్ష్మణ్ (ఎంపీ, ఎమ్మెల్యే), వి.హనుమంతరావు (ఎమ్మెల్యే, ఎంపీ), సలావుద్దీన్ ఒవైసీ (ఎంపీ, ఎమ్మెల్యే), మల్లురవి (ఎంపీ, ఎమ్మెల్యే)లు కూడా పలు హోదాల్లో రాజకీయాల్లో సేవలందించారు.
గత చరిత్రను తరచిచూస్తే జి.వెంకటస్వామి ఒకసారి ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్ నేత చకిలం శ్రీనివాసరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కమ్యూనిస్టు దిగ్గజాలు భీంరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డి,లు కూడా ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేశారు.
మూడు, నాలుగు హోదాల్లో..
రాష్ట్ర స్థాయిలోని ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కొందరు దక్కించుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఒక సభ, దేశ స్థాయిలో మరో సభలోకి ప్రవేశించారు మరికొందరు. రాష్ట్రస్థాయిలోని రెండు సభలు, జాతీయ స్థాయిలోని మరో సభలో అడుగుపెట్టారు ఇంకొందరు. కడియం శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎల్.రమణలు మూడు సభల్లో (అసెంబ్లీ, శాసన మండలి, పార్లమెంట్) ప్రవేశించిన అదృష్టజాతకులుగా నిలిచిపోతారు. కడియం, ఎల్.రమణ రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు.
ఇక, ఎమ్మెల్యే, ఎంపీ కేటగిరీలో ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న పలువురు నాయకులు మంత్రి హోదాలో కూడా పనిచేశారు. మల్లారెడ్డి (మల్కాజ్‌గిరి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీ, రాష్ట్రమంత్రి), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ, మంత్రి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కోదాడ, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే, నల్లగొండ ఎంపీ, మంత్రి), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి, వర్ధన్నపేట ఎమ్మెల్యే, వరంగల్ ఎంపీ, మంత్రి), ఎన్. ఇంద్రకరణ్‌రెడ్డి (ఆదిలాబాద్ ఎంపీ, నిర్మల్ ఎమ్మెల్యే, మంత్రి), వేణుగోపాలాచారి (ఆదిలాబాద్ ఎంపీ, నిర్మల్ ఎమ్మెల్యే, మంత్రి)లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment