సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి కారణంగా మూడు పార్టీల కార్యకర్తలకు నేతలు షాకిలిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ క్రీడలో బీజేపీ, జనసేన పావులుగా మారడంతో నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో తమ కోసమే పనిచేసే నాయకులకు టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు ఫైరవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. కూటమి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్టు జనసేన పవన్ కల్యాణ్ తేల్చి చెప్పడంతో పార్టీ కార్యకర్తలు ఖంగుతున్నారు. ఇక్కడ జనసేన నాయకుడు, పార్టీ ఇన్‌ఛార్జ్ పోతిన మహేష్‌కు సీటు వస్తుందని జనసైనికులు ఆశించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసుకున్నారు. ఇక, తాజాగా పవన్ ప్రకటనతో వీరంతా షాకయ్యారు.
కాగా, సీటు మహేష్‌కు ఇవ్వకపోవడంతో పవన్ తీరుపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ తమను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అన్ని డివిజన్ల ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలతో మహేష్ సమావేశమయ్యారు. పోతినకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు.. పవన్ మోసం తట్టుకోలేని మహేష్.. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు జనసైనికులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనకే కేటాయించాలి. పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టాను. ఇబ్బందులు పడ్డాను.. కేసులు కూడా పెట్టారు. విజయవాడలో జనసేన పార్టీ నిలబడింది అంటే అది నావల్లే. పవన్ పోటీచేసే స్థానంలో టీడీపీ కార్యకర్తలు నానా గోల చేశారు. పిఠాపురంలో అంత డ్యామేజ్ జరిగితే ఒక్క టీడీపీ నేత అయినా స్పందించారా?. ఇదేనా పొత్తు ధర్మం. పొత్తు ధర్మం పాటిస్తేనే ఓట్ల బదిలీ జరుగుతుంది. మన పార్టీ నాయకుడు బాగోకపోతే మనం బాగుంటామా?. పవన్‌కు అవమానం జరిగితే ఒక్క జనసేన నాయకుడైనా స్పందించారా?. విజయవాడలో కేడర్ భవిష్యత్ ఉండాలంటే జనసేనకు సీటు కేటాయించాలి. చివరగా చెబుతున్నా.. నేను జనసేన నుంచే పోటీ చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment