పశ్చిమ బెంగాల్‌లోని సిర్షీలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు
న్యూఢిల్లీ/కోల్‌కతా/మిడ్నాపూర్: పశ్చిమ బెంగా ల్, అస్సాంలో శాసనసభ తొలి దశ ఎన్నికలు శనివారం జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్‌లో 79.79 శాతం, అస్సాంలో 72.14 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. తొలి దశలో బెంగాల్‌లో 30, అస్సాంలో 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా కోవిడ్–19 నిబంధనలను పక్కాగా అమలు చేశారు. కొన్ని పోలింగ్ బూత్‌ల్లో ఓటర్లకు మాస్కులు, శానిటైజర్లు, పాలిథీన్ గ్లోవ్స్ అందజేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) మొరాయించిన ఘటనలు ఈసారి తక్కువగానే రికార్డయ్యాయని ఈసీ తెలిపింది.
చెదురుమదురు ఘటనలు మినహా రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని వివరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సివిజిల్ యాప్ ద్వారా బెంగాల్‌లో 167, అస్సాంలో 582 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు 2 రాష్ట్రాల్లో కలిపి రూ.281.28 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలియజేసింది. బెంగాల్‌లో 74 లక్షల మంది ఓటర్ల కోసం 10,288 పోలింగ్ కేంద్రాలు, అస్సాంలో 81 లక్షల మంది ఓటర్ల కోసం 11,537 పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. కరోనా నిబంధనల దృష్ట్యా ఈసారి పోలింగ్ కేంద్రాల సంఖ్యను భారీగా పెంచారు.
బెంగాల్‌లో ఉద్రిక్తతలు
తొలి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో పలు ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పూర్బ మేదినీపూర్ జిల్లాలోని కాంతి దక్షిణ్‌లో ఈవీఎంలలో గోల్‌మాల్ జరుగుతోందని ఆరోపిస్తూ ఓటర్లు పోలింగ్ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు. ఇక మాజ్నా పట్టణంలో తాము ఒక పార్టీకి ఓటు వేస్తే మరోపార్టీకి వేసినట్లు వీవీప్యాట్ స్లిప్పులు వస్తున్నాయని జనం ఆగ్రహించారు. అధికారులు ఇక్కడ వీవీప్యాట్ యంత్రాన్ని మార్చారు. కాంతిదక్షిణ్‌లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తన కారుపై దాడి చేశారని, డ్రైవర్ గాయపడ్డాడని బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సౌమేందు ఆరోపించారు. దంతాన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మోహన్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో నలుగురు గాయపడ్డారు. ఒక పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి వెళ్తోందని ఆరోపిస్తూ పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేషియారీలో జనం బైఠాయించగా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment