సాక్షి, నల్లగొండ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎండదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వడదెబ్బతో ఆయనకు జ్వరం, తలనొప్పి, నీరసం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో, భటి పాదయాత్రకు బ్రేక్ పడింది. కాగా, వైద్యుల సూచనల అనంతరం భట్టి పాదయాత్ర ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉండగా.. అనారోగ్యానికి గురైన భట్టి విక్రమార్కను కేతేపల్లిలో పొంగులేటి శ్రీనివాస్ కలిశారు. ఈ క్రమంలో భట్టిని పరామర్శించారు. అనంతరం, పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. వేసవి ఎండను కూడా లెక్కచేయకుండా భట్టి విక్రమార్క వంద రోజలు పాదయాత్ర చేశారు. అన్ని కులాలు, మతాల వారిని కలుస్తూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భట్టిని పరామర్శించడానికే ఇక్కడికి వచ్చాను.
సీఎం కేసీఆర్ మాయమాటలతో తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేయడం అభినందనీయం. తెలంగాణ ప్రజలు కన్న కలలు.. కాంగ్రెస్‌తోనే సాధ్యం. రాష్ట్రంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం చేస్తున్నారు. అమరుల కుటుంబానికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా?. తెలంగాణ బిడ్డలు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను క్షమించరు. నేను సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్‌లోకి రావడం లేదు అని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దోపిడీకి గురవుతోంది. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. పొంగులేటి చేరిక సభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారిద్దరూ హ్యాండ్ ఇవ్వనున్నారా?
Comments
Please login to add a commentAdd a comment