Ponguleti Srinivasa Reddy, Jupalli Krishna Rao New Party Joining - Sakshi
Sakshi News home page

పొంగులేటి, జూపల్లి ఆ పార్టీలోకేనా?.. అప్పటి వరకు సస్పెన్స్‌ తప్పదు!

Published Sun, May 7 2023 5:24 PM | Last Updated on Sun, May 7 2023 6:02 PM

Ponguleti Srinivasa Reddy Jupalli Krishna RaoNew  Party Joining - Sakshi

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? చేయి పట్టుకుంటారా? కాషాయ సేనలో చేరుతారా? ఆర్థిక బలం, అంగబలం ఉన్న పొంగులేటి కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గులాబీ గూటి నుంచి బయటపడ్డ ఆ ఇద్దరు నేతలు ఏ పార్టీలో చేరతారో ఈ నెలాఖరులోగా స్పష్టత వస్తుందని టాక్. అంతవరకు సస్పెన్స్‌ తప్పదంటున్నారు. ఆత్మ గౌరవం కోసం పొలికేక పెడతానంటున్న పొంగులేటి పాలిటిక్స్‌..

జూన్ రెండో తేదీ తెలంగాణ  అవతరణ దినోత్సవం. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు జూన్ రెండున తెలంగాణ ఆత్మగౌరవ పొలికేక పేరుతో భారీ సభ నిర్వహించబోతున్నారు. ఆ సభలోనే వారిద్దరూ ఏదో ఒక పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఏ పార్టీలో చేరేది ఈ నెలాఖరుకు తేలిపోనుంది. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం అంటున్న ఇద్దరు నేతలు..కచ్చితంగా జూన్ రెండో తేదీన తాము పార్టీ మారడం ఖాయమని చెబుతున్నారు. కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీలోనే చేరాలని భావిస్తున్న ఈ నేతలు..ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 

కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలిసివచ్చే నేతలే కాకుండా.. ఇంకా అనేక జిల్లాల్లో బీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న నాయకులందరితో మాట్లాడి.. ఒకేసారి భారీ బహిరంగసభ ద్వారా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. సభ వేదికగా ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటారు. ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల్లోని గులాబీ పార్టీ అసంతృప్త నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు.
చదవండి: TS: 15మంది సర్పంచ్‌లకు మావోయిస్టుల హెచ్చరిక 

ఖమ్మం జిల్లాలో ఖమ్మం మినహా మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ భేటీలు ముగిసాయి. ఈ నెల 14న ఖమ్మం నగరంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయబోతున్నారు. ఖమ్మం సభకు జూపల్లితో పాటుగా..నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల నుంచి కూడా బీఆర్ఎస్ అసమ్మతి నేతలు హాజరుకానున్నట్లు చెబుతున్నారు. ఖమ్మం ఆత్మీయ భేటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తమ సత్తా ఏంటో చూపించేందుకు పొంగులేటి వర్గం సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వారిద్దరి అనుచరులను చేర్చుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే చర్చలు జరిగాయి. గురువారం నాడు బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో పొంగులేటి నివాసంలో దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిగాయి. అయితే బీజేపీలో చేరతామని వారిద్దరూ ఈటల టీమ్‌కు ఎటువంటి హామీని ఇవ్వలేదు. బీజేపీ నేతలు మాత్రం తమ పార్టీలోనే పొంగులేటి, జూపల్లి వర్గాలు చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏదో ఒక పార్టీలో చేరే తేదీని జూన్‌ రెండుగా ఖరారు చేసుకున్ననందున..ఆలోగా తమ అనుచరవర్గం ఉన్న జిల్లాల్లోని నాయకులతో ఆత్మీయ భేటీలు నిర్వహించడానికి ప్లాన్‌ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ కనీసం ఐదు సెగ్మెంట్లలో భేటీలుంటాయని సమాచారం. అంతిమంగా జూన్‌ రెండున పొలికేక పేరుతో భారీ బహిరంగసభలో పొంగులేటి వర్గం పార్టీ మార్పిడి కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది.

ఇద్దరినీ గులాబీ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. ఇక ఏ పార్టీలో చేరాలనే విషయంపై పొంగులేటి, జూపల్లి నిర్ణయించుకోవాలి. ఏ పార్టీ అనేదానిపై ఈ నెలాఖరు వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. కొత్త పార్టీలో చేరిక కోసం జూన్ రెండోతేదీని ముహూర్తం ఫిక్స్‌ చేశారు. కాని పార్టీని మాత్రం ప్రకటించలేదు. పొంగులేటి, జూపల్లి సస్పెన్స్‌కు తెర దించేవరకు వేచి చూడక తప్పదు. ఏదేమైనా వచ్చే నెలలో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి.
చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement