సాక్షి, అమరావతి : టీడీపీ నేత నారా లోకేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగాభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర ఆరోపణ చేశారు. అందుకోసమే తనపై పరువునష్టం దావా వేశారని.. ఈ కేసులో మంగళగిరి కోర్టుకు వెళ్లివచ్చే సమయంలో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే దానికి లోకేశే కారణమని ఇదే తన మరణ వాంగ్మూలంగా భావించాలన్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. పోసాని ఇంకా ఏమన్నారంటే..
గతంలో లోకేశ్ నన్ను పార్టీలోకి రావాలని కోరారు. నేను నిబద్ధత కలిగిన నాయకుల వెంటే ఉంటానంటూ తిరస్కరించా. పైగా వారి అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాను. అందుకే వాళ్లు నాపై కక్షగట్టారు. నేను ఎప్పుడో కంతేరులో లోకేశ్ భూములు కొన్నారని చెప్పానట. దానిని పట్టుకుని నాపై రూ.4 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. రెండేళ్లు జైలుశిక్ష కూడా వేయిస్తారట. కంతేరులో హెరిటేజ్ పేరిట భూములు కొన్నది వాస్తవం కాదా? లోకేశ్ భూములు దోచేశారు.. కబ్జా చేశారనలేదే నేను. కొన్నారనే చెప్పాను. మీ కుటుంబ సభ్యులు కొంటే నీకు సంబంధం లేదా? మీ తల్లి, భార్య పేరు మీద ఉన్న ఆస్తులు ఎవరికి లోకేశ్?
పవన్ వ్యాఖ్యలు మర్చిపోయారా?
అల్‌ఖైదా అంటే లాడెన్ గుర్తొచ్చినట్లు.. హెరిటేజ్ అంటేనే చంద్రబాబు గుర్తొస్తారు. నిత్యం బూతులతో జపంచేసే లోకేశ్‌పై తాను పరువు నష్టం కేసువేస్తే 20 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంటుంది. గతంలో దళితులు, సీఎం జగన్‌ను, పోలీసు అధికారులను దుర్భాషలాడిన లోకేశ్ వీడియోలను, విదేశీ మహిళలతో అర్ధనగ్నంగా దిగిన ఫొటోలను మీడియా ఎదుట పోసాని ప్రదర్శించారు. గతంలోనే లోకేశ్ బతుకును వపన్‌కళ్యాణ్ రోడ్డున పడేశారు.
ప్రతి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం చేశారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా? సమాజంలో బూతులు మాట్లాడేవాళ్ల కంటే బూతుపనులు చేసే లోకేశ్ లాంటి వ్యక్తులతోనే ఎక్కువ ప్రమాదం. చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్ చేసే సత్తా ఉంది. అందుకే 16 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. పుంగనూరులో పోలీసులపైనే దాడులు చేయించారు. నేనెంత బక్కవాడిని. లోకేశ్ ఏంచేసినా కాపాడటానికి చంద్రబాబు ఉన్నారు. లోకేశ్ కంటే నాకు విశ్వసనీయత ఎక్కువ ఉంది.. అంతేగాని, అమ్ముడుపోయే వాడిని కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవొచ్చు.. కమ్మ కులమే గెలవాలనుకోవడం దుర్మార్గం.
ఎవరు గెలిచినా ప్రజలకు ఎంత మంచి చేస్తున్నారో చూడాలే తప్ప కులం దురాభిమానంలో పడకూడదు. రాజధానిలో ఐదు శాతం భూములు పేదలకు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ చంద్రబాబు దానిని తుంగలో తొక్కారు. రాజధానిలో పేదలకు సెంటు భూమి ఇవ్వడంలో తప్పేంటని నేను ప్రశ్నిస్తే.. ఓ కమ్మ రైతు పెదకాకానిలో నాకున్న 16 ఎకరాలు ఇవ్వమంటూ బూతులు తిట్టాడు. అసలు నాకు అక్కడ భూమేలేదు. ఐదారు ఇళ్ల స్థలాలు, రెండు పెంకుటిళ్లు ఉన్నాయి.
జగ్గయ్యపేట దగ్గర 30 ఏళ్ల కిందట కొన్న కొంత భూమి ఉంది. మా నాన్న డబ్బులేక ఆత్మహత్య చేసుకున్నారు. నేను సినిమాల్లోకి వెళ్లిన తర్వాతే సంపాదించుకున్నా. అయినా, ఏపీలోని నా ఆస్తి మొత్తం పేద ప్రజలకు ఇచ్చేస్తా.. రాజధాని రైతులకు మానవత్వం ఉంటే పేదలకు సెంటు భూమి ఇవ్వండి. కోర్టు కేసులను వెనక్కితీసుకోండి. రాజధాని భూముల్లో వ్యాపారం తప్ప త్యాగాల్లేవు. వైఎస్సార్ రూ.11వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తే అందులో మా కులం వాళ్లు కూడా లబ్ధిపొందారు.. ఇప్పుడు పేదలకు తమ భూములు ఇవ్వొద్దని వారు చెప్పడం సిగ్గుచేటు.
Comments
Please login to add a commentAdd a comment