అధికారమే లక్ష్యంగా జత కట్టిన మూడు పార్టీలు
సీట్ల కేటాయింపులో తప్పటడుగులు.. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు మొండిచేయి
జనసేనలో శెట్టిబలిజలకు ప్రాతినిధ్యం నిల్..
కాపులను విస్మరించిన కమలనాథులు..
ఆ రెండు వర్గాలకూ వైఎస్సార్‌సీపీ పెద్దపీట
అధికారమే లక్ష్యంగా జెండాలు జతకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల కేటాయింపుతో బొక్కబోర్లా పడ్డాయి. రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి జిల్లాలపై గంపెడాశలు పెట్టుకున్న ఆ కూటమికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పొత్తులు, సీట్ల సిగపట్లతో బలహీనపడి అసలు ఉనికికే ముప్పు తెచ్చుకున్నాయి. ఈ జిల్లాల్లో కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాలే రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
ఈ సామాజిక వర్గాలు కూటమి వెంట ఉంటాయని లెక్కలేసుకుని జనసేన, టీడీపీలు తమదే గెలుపంటూ బీరాలు పలికాయి. అదే సమయంలో సీట్ల పంపకాల్లో ఆ పార్టీలు తమకు ప్రాధాన్యమిస్తాయని ఆయా సామాజిక వర్గాలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. తీరా టికెట్ల కేటాయింపులో అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు సరైన ప్రాధాన్యం కల్పించకపోవడంతో వాటి నుంచి కూటమికి ఎదురు దెబ్బ తప్పదన్న సంకేతాలు అందుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, కాకినాడ
శెట్టిబలిజలను విస్మరించిన జనసేన
జనసేన బలం, బలహీనత గోదావరి జిల్లాలే అన్న ధీమా అన్నివర్గాల్లో ఉండేది. తీరా సీట్ల కేటాయింపులో ప్రధానమైన శెట్టిబలిజ సామాజికవర్గాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పూర్తిగా పక్కన పెట్టేసింది. ఉమ్మడి తూర్పులో ఒక్కటంటే ఒక్కటికూడా వారికి కేటాయించలేదు.
ఈ జిల్లాలో జనసేన ఆరు అసెంబ్లీ, కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండగా పి.గన్నవరం, రాజోలు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు పోను నిడదవోలు, రాజానగరం, కాకినాడ రూరల్, పిఠాపురం టికెట్లను సొంత సామాజిక వర్గానికే పవన్‌కళ్యాణ్ ఇచ్చుకున్నారు. శెట్టిబలిజలను విస్మరించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ ముమ్మిడివరంలో సొంత సొమ్ము తగలేసుకుని అహోరాత్రులు శ్రమిస్తున్న ఆ సామాజికవర్గానికి చెందిన పితాని బాలకృష్ణకు సీటు ఇస్తామని నమ్మించి మోసం చేశారు.
బీసీల తోక కత్తిరిస్తానంటూ చిన్నచూపు చూసే చంద్రబాబుతో జతకట్టి శెట్టిబలిజలకు సీటు లేకుండా మోసం చేశారని ఆ సామాజికవర్గం పవన్‌పై నిప్పులు చెరుగుతోంది. ఈ అవమానాన్ని భరించలేకే బాలకృష్ణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌పై నమ్మకంతో శనివారం ఆ పార్టీలో చేరారు. సీట్ల కేటాయింపులో వివక్షను తట్టుకోలేక కాకినాడ మాజీ మేయర్ సరోజ సైతం జనసేనను వీడారు.
టీడీపీకి తప్పని తిప్పలు
కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు మూడు పార్టీల కూటమితో బాగా బలపడ్డామని సంబరపడ్డారు. కానీ ఆయన అంచనాలు తూర్పులో తలకిందులయ్యాయి. ఓటమి సంకేతాలు అందిస్తున్నాయి. పొత్తులో సీట్లు కోల్పోయిన నిడదవోలు, రాజోలు, పి.గన్నవరం, పిఠాపురం, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య అంతర్గత పోరు, అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
వీటితో పాటు తుని, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అమలాపురం, కొవ్వూరు, గోపాలపురం స్థానాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పనిలో పనిగా పలువురు నేతలు టీడీపీకి దూరమవుతున్నారు. ఈ పరిణామాలను చక్కదిద్దలేక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు.
ఆ రెండు వర్గాలకు బీజేపీ మొండిచేయి
ఈ జిల్లాలో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న కాపు, శెట్టిబలిజలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని ఆ సామాజికవర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం, అనపర్తి అసెంబ్లీ స్థానాలను సామాజికంగా బలం లేని వర్గాలకు కేటాయించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన సీనియర్ నాయకుడు, కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజు రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం గానీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటైనా ఇవ్వాలని కోరారు. కానీ ఆయనకు కాదని స్థానికేతరురాలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం కేటాయించారు. అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని కూడా సామాజికంగా బలం లేని శివరామకృష్ణంరాజుకు కేటాయించడాన్ని వారు తప్పుపడుతున్నారు. దాంతో వారు కూటమికి దూరమవుతున్నారు.
వైఎస్సార్‌సీపీలో బీసీలకే పెద్దపీట
వైఎస్సార్‌సీపీ మొదటినుంచీ బీసీలపై ఆదరణ చూపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానాన్ని శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌కు, రాజమహేంద్రవరం రూరల్‌ను రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు, రామచంద్రపురాన్ని పిల్లి సూర్యప్రకాశ్‌కు కేటాయించింది. వీటితో పాటు బీసీల్లో గౌడ సామాజికవర్గం నుంచి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను రాజమహేంద్రవరం సిటీ నుంచి బరిలోకి దింపింది.
జనసేనలో తమకు జరిగిన అవమానాన్ని భరించలేక ఈ జిల్లాల్లోని శెట్టిబలిజలతో పాటు చేనేత, మత్స్యకార వర్గాలు రాజకీయంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి కూడా వైఎస్సార్‌సీపీ సముచిత ప్రాధాన్యమే కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని 21 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింటితో పాటు సంప్రదాయంగా ఇస్తున్న కాకినాడ లోక్‌సభ స్థానాన్ని కూడా ఆ వర్గానికే కేటాయించింది. దీంతో ఆ సామాజికవర్గం వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment