సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ పశ్చిమ బెంగాల్ మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లకు 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తరని తెలిపారు. బెంగాల్‌లో పరిస్థితి ఇలా ఉందని చెప్పారు. రాష్ట్రంలో పీఎం దక్ష్ పథకాన్ని అమలు చేయాలని, ఈ విషయంపై అధికారులతో మాట్లాడుతారా? అని బెంగాల్ బీజేపీ ఎంపీ ఎస్‌ఎస్ అహ్లూవాలియా పార్లమెంటులో మంగళవారం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ మంత్రుల ఫోన్ ఎన్నిసార్లు రింగ్ అయినా పట్టించుకోరని, వాళ్ల సిబ్బంది కూడా ఇతరులకు మంత్రుల ఫోన్ నంబర్ ఇవ్వాలంటేనే భయపడతారని పేర్కొన్నారు. ఇలా రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య సమన్వయం లేనప్పుడు పథకాల అమలు ఎలా సాధ్యమవుతుందన్నారు.
బెంగాల్ బర్హంపోర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ లోకసభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ముర్షీదాబాద్ జిల్లా అభివృద్ధికి సాయం చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఫోన్లు ఎత్తకపోవడం, ఇతరులు చెప్పేది పట్టించుకోకపోవడం టీఎంసీ నేతలకు అలవాటే అన్నారు.
దీనికి స్పందిస్తూ ముర్షీదాబాద్ జిల్లాలోని వికలాంగులు, సీనియర్ సిటిజెన్లకు రూ.12 కోట్లు విలువచేసే ఉపకరణాలను పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రతిమా చేప్పారు. 16వేల మందికి వీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తమకు రాష్ట్రం నుంచి సహకారం అందడం లేదని ఆరోపించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ లోక్‌సభలోని టీఎంసీ సభ్యులు నిరసనకు దిగారు.
చదవండి: నెహ్రూ, వాజ్‌పేయిల మూర్ఖత్వం వల్లే టిబెట్, తైవాన్ చైనాలో కలిశాయి
Comments
Please login to add a commentAdd a comment