సాక్షి, శివాజీనగర(కర్ణాటక): హిందీ దివస్‌ను వ్యతిరేకిస్తూ కన్నడనాట మంగళవారం నిరసనలు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోందని, ఇది ముమ్మాటికీ ప్రాంతీయ భాషలపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తూ కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చళవళి వాటాళ్ పార్టీ, జయకర్ణాటక తదితర పార్టీలు, సంఘాల నాయకులు రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు.
బెంగళూరులోని మైసూరు బ్యాంకు సర్కిల్‌లో కన్నడ చళవళి వాటాళ్ పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు హిందీ పోస్టర్లను తగులబెట్టి కేంద్రసర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాగరాజు మాట్లాడుతూ కర్ణాటకలో కన్నడ భాషకే అగ్రతాంబూలం ఉండాలని, కన్నడిగుడే దొర అని, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బలవంతంగా హిందీ భాషను అమలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
బ్యాంక్, రైల్వే, తపాలా కార్యాలయాల్లో కన్నడ తప్పకుండా ఉండాలన్నారు. డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సా.రా.గోవిందు మాట్లాడుతూ హిందీ పుట్టుకముందే కన్నడ భాష ఉదయించిందని తెలిపారు. బ్యాంకుల ముందు ధర్నా చేపట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వేడి పుట్టిస్తామని కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment