మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డప్పుకొట్టి నిరసన తెలుపుతున్న మంత్రి సత్యవతి రాథోడ్, గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన ధర్నాలో ఫ్లకార్డు చూపిస్తూ మంత్రి హరీశ్ నిరసన
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్‌వర్క్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఊరూరా చావుడప్పు మోగించడంతో పాటు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. పాడెలు మోస్తూ శవయాత్రలు నిర్వహించారు. ప్రధానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వరి ధాన్యం కొనుగోలు చేయాలని, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు వంటి రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.
ఆకులమైలారం ధర్నాలో సబిత, ఖమ్మం జిల్లాలో పువ్వాడ..
రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలనే నినాదంతో ఢిల్లీ కేంద్రంగా రైతులు చేపట్టిన ఆందోళనను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రలకు రైతులు బలికాకుండా, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం..
మహబూబ్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో నియోజకవర్గంలోని 58 గ్రామాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు వేలాది మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. చావుడప్పు మోగించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీలో దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొని చావు డప్పు కొట్టారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తల్లాడలో ధాన్యం మూటలు తలపై పెట్టుకుని భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
మహబూబ్‌నగర్‌లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య తోపులాట
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య తోపులాట జరిగింది. రెండు పార్టీలు ఆందోళనలు చేస్తున్న క్రమంలో ఇరువర్గాల మధ్య పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని ఆకులమైలారంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీలోని బంజారాహిల్స్‌లో మేయర్ గద్వాల విజయలక్ష్మి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్నా
► రైతు వ్యతిరేక బీజేపీకి గుణపాఠం చెప్పాలి. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రాజకీయ కుట్రలు చేస్తున్న పార్టీని గ్రామగ్రామానా నిలదీయాలి. బీజేపీ రైతుల ఉసురు పోసుకుని కార్పొరేట్ వర్గాలకు లాభం చేకూరుస్తూ బడా కంపెనీలకు కొమ్ము కాస్తోంది. – గజ్వేల్ ధర్నాలో హరీశ్
Comments
Please login to add a commentAdd a comment