ఘట్‌కేసర్: ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగింది. సభకు సంబంధించిన అంశాలను వదిలిపెట్టి పదేపదే టీఆర్‌ఎస్ పథకాలను, సీఎం కేసీఆర్‌ను ప్రస్తావించడంపై సభికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మల్లారెడ్డి డౌన్ డౌన్.. మల్లారెడ్డి గో బ్యాక్..’అంటూ కుర్చీలు, రాళ్లు, చెప్పులను స్టేజీపైకి విసిరారు. ప్రసంగం మధ్యలోనే ఆపి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్ వెంటపడి మరీ రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కష్టమ్మీద వారిని అడ్డుతప్పించి మల్లారెడ్డిని బయటికి తరలించారు.
తీపి కబురు చెప్తారనుకుంటే..
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో ఆదివారం ‘రెడ్ల సింహగర్జన’ సభ జరిగింది. మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2018 ఎన్నికల సమయంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. మంత్రి మల్లారెడ్డి దానికి సంబంధించి తీపి కబురు చెప్తారని సభకు హాజరైనవారు ఆశించారు. అయితే ప్రసంగం ప్రారంభించిన మల్లారెడ్డి.. ఈ విషయాన్ని పక్కనపెట్టి టీఆర్‌ఎస్ పథకాలను పదేపదే ప్రస్తావించడం ప్రారంభించారు.
తెలంగాణలో 75 ఏళ్లలో జరగని అభివృద్ధి గత ఏడున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో జరిగిందన్నారు. దీంతో ఆగ్రహించిన కొందరు నాయకులు, సభికులు మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కుర్చీలు పైకెత్తి నిరసన తెలిపారు. రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి తదితరులు సముదాయించడంతో శాంతించారు. అందరూ ప్రశాంతంగా కూర్చుంటే మల్లారెడ్డి మంచి కబురు చెప్తారంటూ.. ఆయనకు మరోసారి మాట్లాడే అవకాశం ఇచ్చారు.
తీరు మార్చుకోకపోవడంతో..
సభికులు నిరసన వ్యక్తం చేసినా మంత్రి మల్లారెడ్డి తీరు మార్చుకోలేదు. రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ.. టీఆర్‌ఎస్, కేసీఆర్‌లను పొగుడుతూ ప్రసంగం కొనసాగించారు. ఈ క్రమంలో ఆయన దళిత బంధు, ఇతర పథకాలను వివరిస్తూ.. మళ్లీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందంటూ వ్యాఖ్యానించే సరికి.. సభికుల నుంచి నిరసన తీవ్రమైంది. వేదికపై ఉన్న మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ హరివర్ధన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి సహా మరికొందరు మంత్రితో వాగ్వాదానికి దిగారు.
అదే సమయంలో సభికులు ‘మల్లారెడ్డి డౌన్ డౌన్.. మల్లారెడ్డి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలుపుతున్నవారు కుర్చీలు, రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లను స్టేజ్‌పై మల్లారెడ్డి వైపు విసిరారు. పోలీసులు వెంటనే సభా వేదిక పైకి వచ్చి మంత్రికి రక్షణగా నిలిచారు. అతికష్టమ్మీద మల్లారెడ్డిని కాన్వాయ్ వద్దకు తీసుకువెళ్లి వాహనంలో కూర్చోబెట్టారు. కాన్వాయ్ వెళ్తున్న సమయంలోనూ సభాస్థలి నుంచి జాతీయ రహదారి వరకు వెంటపడిన సభికులు.. రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లను విసిరారు. మంత్రి వెళ్లడంతోనే సభ ముగిసింది. సభికులంతా ఆగ్రహంతో వెనుదిగారు. ‘రెడ్ల సింహ గర్జన’ ఏర్పాటు కోసం నెల రోజులకు పైగా కష్టించామని, మంత్రి వేదికపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సభను విఫలం చేశారని నిర్వాహకులు అసహనం వ్యక్తం చేశారు.
వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: ‘రెడ్డి సింహగర్జన’ మహాసభ డిమాండ్
సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధమైన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ‘రెడ్డి సింహగర్జన మహాసభ’ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేరుగా సీఎంలు ఇచ్చిన హామీలు కూడా అమలు కాకపోవడం గతంలో ఎన్నడూ చూడలేదని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి వర్గం సహనాన్ని పరీక్షించడం మానుకుని.. ఓసీల్లోని పేదల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో రెడ్ల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించింది. ఘట్‌కేసర్ సభలో రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి, రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు తదితరులు మాట్లాడారు.
2018 ఎన్నికల సమయంలో, హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పేద రెడ్ల సంక్షేమం కోసం ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని వారు గుర్తు చేశారు. ఓసీ సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరిస్తామన్న హామీలు కలగానే మిగిలాయని విమర్శించారు. రూ.5 వేల కోట్లతో చట్టబద్ధమైన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని.. విదేశాల్లో ఉన్నత విద్యకోసం పేద రెడ్లకు రూ.25 లక్షల ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు 244ను అమలు చేయాలని, వయసుతో సంబంధం లేకుండా రైతులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా, 50 ఏళ్లు నిండిన రైతులకు రూ.5వేల పెన్షన్, ఉపాధి హామీతో వ్యవసాయ రంగం అనుసంధానం, రైతుల పంటలకు గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment