
సాక్షి నెట్‌వర్క్ : పేదలకు ఉచితంగా ఇస్తున్న ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. పేదవారంటే చంద్రబాబుకి మొదటి నుంచి చులకన భావమేనని.. అధికారంలో ఉన్నప్పుడు అధికార దాహంతో పేదలపై, దళితులపై దాడులు చేయించాడని, ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచితంగా ఇళ్ల పట్టాలు అందిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చులకనగా మాట్లాడుతుండడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇందుకు నిరసనగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నిరసన ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను తగులబెట్టారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ఇళ్ల లబ్ధిదారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినదించారు. పేదలను చులకనగా చూస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో సమాధికడతామంటూ హెచ్చరించారు.
విజయనగరం, చీపురుపల్లి, రాజాం, నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు, బైక్‌ర్యాలీలు నిర్వహించారు. సాలూరులో మంత్రి పీడిక రాజన్నదొర భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా ఓ బైక్ తగలడంతో ఎడమకాలికి గాయమైంది. వైద్యులు పరీక్షించి మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, టెక్కలి, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోనూ ర్యాలీలు జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన బైక్ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్థంచేశారు.
చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, అరకు, పాడేరులలో పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పెద్దఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల చంద్రబాబుతోపాటు అయ్యన్నపాత్రుడి దిష్టిబొమ్మలను దగ్థంచేశారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా బైక్ ర్యాలీలు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తణుకులో జరిగిన ర్యాలీలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ర్యాలీలు నిర్వహించి చంద్రబాబు వ్యాఖ్యలను నిరసించారు. గుంటూరులో జరిగిన భారీ నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సమాధులతో పోల్చి చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మోటార్ సైకిల్ ర్యాలీలతో నిరసన తెలిపారు.