సాక్షి, చెన్నై: అధికారంలోకి వస్తే గృహిణులకు ప్రతినెలా రూ. వెయ్యి ఆర్థిక సాయం అందించనున్నట్టు పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే, 10,12 తరగతుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే, సీపీఐలు కూటమిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 30 స్థానాల్లో కాంగ్రెస్ 15 చోట్ల, డీఎంకే 13, మిగిలిన రెండు పార్టీలు తలా ఓ చోట అభ్యర్థులను నిలబెట్టాయి. ఈ పరిస్థితుల్లో తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న పథకాలను వివరిస్తూ సిద్ధం చేసిన మేనిఫెస్టోను మాజీ సీఎం నారాయణస్వామి, కాంగ్రెస్ సీనియర్ వీరప్పమొయిలీ ఆదివారం పుదుచ్చేరిలో విడుదల చేశారు. ఇందులోని ఉచిత పథకాలు అనేకం ప్రకటించారు.
ఫింఛన్ రూ.5వేలు..
కుటుంబకార్డు కల్గిన గృహిణులకు నెలకు రూ. వెయ్యి నగదు సాయం అందించనున్నట్టు ప్రకటించారు. వృద్ధులు, వితంతువులు, ఆదరణ లేని వారికి, దివ్యాంగులకు అందిస్తున్న పింఛన్ దశల వారీగా రూ.5వేల వరకు పెంచనున్నారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనున్నారు. ప్రతినెలా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, చక్కెర, పప్పు దినుసుల్ని సక్రమంగా అందించనున్నారు. పుదుచ్చేరిలో మూతపడి ఉన్న మిల్లులను మళ్లీ పునరుద్ధరిస్తామని ప్రకటించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని, నీతి ఆయోగ్‌లో పుదుచ్చేరికి చోటు దక్కే రీతిలో చర్యలు తీసుకుంటామని వివరించారు. విద్య నిమిత్తం ప్రత్యేక బోర్డు ఏర్పాటు, విద్యార్థులకు రోజుకు 2జీబీ చొప్పున నెలకు 60 జీబీల డేటా ఉచితంగా అందించనున్నామని ప్రకటించారు. ఇలా మరికొన్ని ఉచిత పథకాలను సైతం ఇందులో పొందు పరిచారు.
74 మంది కోటీశ్వర్లు..
పుదుచ్చేరిలో వివిధ పార్టీలకు చెందిన 74 మంది కోటీశ్వరులు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అంటూ 324 మంది పోటీలో ఉన్నారు. ఇందులో ఓ స్వతంత్ర అభ్యర్థి అఫిడవిట్ సరిగ్గా లేదు. మిగిలిన 323 మంది అభ్యర్థులు సమర్పించిన ప్రమాణ పత్రాల మేరకు 74 మంది కోటీశ్వర్లు పోటీలో ఉన్నారు. 2016 ఎన్నికల్లో 96 మంది కోటీశ్వర్లు పోటీ చేయగా, ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గింది. ఇక, పోటీలో ఉన్న 84 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు అనేకం విచారణంలో ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment