Puducherry Government In Crisis As 4 More Congress MLAs Resigned - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల రాజీనామా.. సంక్షోభంలో కాంగ్రెస్‌ సర్కార్‌

Published Tue, Feb 16 2021 2:14 PM | Last Updated on Tue, Feb 16 2021 4:05 PM

Puducherry govt in crisis 4 MLAs Resigns - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే రాజీనామాలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఎన్నికలపై సమీక్ష జరిపేందుకు ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. రెండు రోజుల క్రితమే యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీకి,  ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. ఈ షాక్‌ నుంచి తేరుకోకముందే మంగళవారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుద్దుచ్చేరి రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి.

మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి అప్రమత్తం అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కెబినేట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలు, సీనియర్లతో విడివిడిగా సమావేశం అయ్యారు. కాగా మొత్తం 30 మంది శాసనసభ్యులు గల పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్‌-డీఎంకే కూటమికి 16 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్షానికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తాజా రాజీనామాలతో అధికార పార్టీ బలం 11కి పడిపోయింది.

కాగా యానం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లాడి కృష్ణారావు.. నారాయణ స్వామి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత నెలలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా యానాం శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మల్లాడి కృష్ణారావు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంకు 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. పుదుచ్చేరిలో అనేక పదవులు చేపట్టారు. యానాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజల మనిషిగా పేరు పొందారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన  తరువాత ఏ పార్టీలో చేరతారు అనేది ఇంకా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement