
చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య సవాళ్లు ఎక్కువయ్యాయి. అయితే వీటిలో అన్నీ సీరియస్ ఛాలెంజులు కాదు. ‘దమ్ముంటే ఒక్క సీటులో పోటీ చెయ్యి, సత్తా ఉంటే 30 నిమిషాలు ఆగకుండా బ్యాడ్మెంటెన్ ఆడు..’ లాంటి కాలక్షేపం సవాళ్లు కూడా ఉన్నాయి. కేవలం చిన్నా చితకా అభ్యర్ధులే సవాళ్లు విసురుకుంటున్నారనుకుంటే పొరపాటే! సీఎం చన్నీ, పీఎల్‌సీ నేత అమరీందర్, పీసీసీ చీఫ్ సిద్ధూ లాంటి వాళ్లు కూడా జోరుగా ఛాలెంజులు చేస్తున్నారు.
చన్నీ రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, సిద్ధూను ఎదుర్కొనేందుకు ఎస్‌ఏడీ నేత మజితియా సిద్ధపడడంతో ఈ ఛాలెంజుల వేడి పెరిగింది. చన్నీ రెండు సీట్లలో పోటీ చేయడంపై ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, చన్నీ తప్పకుండా చమకూర్ సాహెబ్ సీటు ఓడిపోతారన్నారు. దీనిపై వెంటనే చన్నీ స్పందించి తనకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలని కేజ్రీవాల్‌కు సవాలు విసిరారు.
అదే కోవలో పాటియాల సీటు వదిలి తనపై అమృతసర్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయాలని అమరీందర్ సింగ్‌ను నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ ఛాలెంజ్ చేశారు. అంతటితో ఆగకుండా అమరీందర్ ఆపకుండా 30 నిమిషాలు బ్యాడ్మెంటెన్ ఆడితే తాను రాజకీయాలు వదిలేస్తానని ఎద్దేవా చేశారు. అలాగే తనపై పోటీకి దిగిన ఎస్‌ఏడీ నేత మజితియా కేవలం తనపై మాత్రమే పోటీ చేయాలని, మజితా నియోజకవర్గం వదిలిపెట్టాల ని సిద్ధూ సవాల్ చేశారు. దీన్ని మజితియా అంగీకరించి అమృత్‌సర్ సీటుకే పరిమితమయ్యారు.