ఫైల్ ఫొటో
చండీగఢ్: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసిపోయిందని భావిస్తున్న సమయంలో ఓ ‘విందు’ ఆ సంక్షోభాన్ని మరింత పెంచేలా ఆజ్యం పోస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒక వర్గంగా, నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూకు పంజాబ్ పీసీసీ బాధ్యతలు అప్పగించి పదోన్నతి కల్పించింది. దీంతో వివాదం సమసిపోయిందని అనుకుంటుండగా తాజాగా ముఖ్యమంత్రి ఏర్పాటు చేయబోతున్న ఓ విందు విబేధాలు ఇంకా తొలగిపోలేదని స్పష్టం చేస్తోంది.
జూలై 21వ తేదీన పంచకులలో సీఎం అమరీందర్ సింగ్ విందు ఏర్పాటుచేశారు. భోజనానికి పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజోత్ సింగ్ సిద్ధూకు మాత్రం ఆహ్వానం పంపలేదు. సిద్ధూను అధ్యక్షుడిగా ప్రకటించిన మరుసటి రోజే సీఎం అమరీందర్ ఈ విందు ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారింది. తాజాగా పార్టీ నియమించిన పీసీసీ కార్యవర్గంలో సీఎం అమరీందర్ వర్గానికి ప్రాధాన్యం దక్కలేదు. పైగా ఇంకా సిద్దూపై కోపంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం తన బలం ప్రదర్శించేందుకు ఈ విందు ఏర్పాటు చేశారని పంజాబ్‌లో చర్చ సాగుతోంది.
తనకు క్షమాపణలు చెప్పేంత వరకు సిద్ధూను కలిసే ప్రసక్తే లేదని పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సీఎం అమరీందర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య విబేధాలు పార్టీకి ప్రతికూలంగా మారాయి. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నా కాంగ్రెస్‌లో విబేధాలు సద్దుమణగకపోవడంతో పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని రెండో స్థాయి నాయకులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే అధికారం కోల్పోయే ప్రమాదం ఉందని, వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment