చండీగఢ్ : పంజాబ్‌లోని నవాషహర్ అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈసారి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ సైనీకి కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. గత 60 ఏళ్లలో సైనీ కుటుంబ సభ్యులకే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 13 సార్లు టికెట్లు ఇచ్చింది. కానీ అంగద్ సింగ్ భార్య అదితి సింగ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ బీజేపీలో చేరడంతో ఆయనకు పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో అంగద్ సింగ్ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోవైపు అమరీందర్ సింగ్ పార్టీ నుంచి వచ్చిన సత్వీర్ సింగ్ పల్లీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇచ్చాక అమరీందర్‌కు చెందిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ సత్వీర్ సింగ్‌ను జిల్లా అధ్యక్షుడిని చేసింది. దీంతో ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియక కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే తనకు చెప్పకుండానే అమరీందర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారని, తాను కాంగ్రెస్ వ్యక్తినేనని సత్వీర్ సింగ్ చెప్పుకోవాల్సి వస్తోంది.
ఈసారి 60 మంది సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినప్పటికీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అంగద్ సింగ్ సైనీ కాంగ్రెస్‌ను ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు. రెండు వేర్వేరు పార్టీలలో భార్యాభర్తలుండడం చాలా సహజమైన అంశమని, తన పనిని కాంగ్రెస్ గుర్తించలేదని మండిపడుతున్నారు. సైనీ కుటుంబానికి ఈ నియోజకవర్గంపై కొన్ని దశాబ్దాలుగా పట్టు ఉంది. మొత్తమ్మీద ఈ వివాదాల నడుమ ఆప్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన నవాషహర్ కౌన్సిలర్ లలిత్ మోహన్ పాఠక్ పంట పండే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. (చదవండి: నన్నే సీఎంగా ఉండమన్నారు!)
Comments
Please login to add a commentAdd a comment