ముషీరాబాద్: ఉద్యోగాలు లేక రోజుకొకరు చొప్పున నిరుద్యోగులు చస్తుంటే రిటైర్‌మెంట్ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రంలోని 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కనీసం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకోలేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 ఏళ్లు గడిచినా 30 వేల పోలీస్ ఉద్యోగాలు, మరో 15 వేల ఇతర ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందన్నారు.
ఇంకా గ్రూప్–1లో 1500, గ్రూప్–2లో 4వేలు, గ్రూప్–4 సర్వీస్ 40 వేల క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు. ఇంకోవైపు రిటైర్ అయిన వేలాదిమంది ఉన్నతాధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాజకీయ అవినీతికి పునాదులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ వయోపరిమితిని పెంచితే కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్‌లు రావాని, అంతేకాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని, బకాయిలుగా పేరుకుపోయిన డీఏలులు చెల్లించాలన్నారు. కేవలం వయోపరిమితి పెంచి ఉద్యోగాలకై ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పొట్టకొడితే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. త్వరలో అన్ని ప్రజా సంఘాలు, యువజన , విద్యార్థి సంఘాలతో సమావేశమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
రిటైర్మెంట్ వయస్సు పెంచొద్దు..
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచొద్దని తెలంగాణ స్టూడెంట్ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ మంగళవారం కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం వల్ల నిరుద్యోగం బాగా పెరుగుతుందన్నారు. ఇప్పుడున్న రిటైర్మెంట్ వయస్సును కొనసాగిస్తూ అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనీ సీఎం కేసీఆర్‌కు నాగరాజు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment