సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ లీడర్ల మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది. ఇటీవల రేవంత్, ఈటల మధ్య సవాల్ ముగిసిన వెంటనే మరో సవాల్‌తో ముందుకొచ్చారు నేతలు. మంత్రి నిరంజన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. నిరంజన్ రెడ్డి చేసిన సవాల్‌కు సిద్ధమన్నారు రఘునందన్ రావు. నిరంజన్ రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ఎప్పుడు పిలిచానా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోపణలకు స్పందించి ఆహ్వానించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఇక, తాజాగా రఘునందన్ మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఈడీ విచారణ జరపాలి. మంత్రి పాత ఫోన్ నెంబర్ నుంచి చైనాకు కాల్స్ వెళ్లాయి. మంత్రి పాత నెంబర్ ఎందుకు మార్చారు?. మంత్రికి ఉన్న దత్తపుత్రులు ఎవరు?. దత్తపుత్రుడికి కాంట్రాక్ట్‌లు.. వియ్యంకుడికి వీసీ పదవులు. కొన్న భూములకు మంత్రి లెక్కలు చూపించాలి. గౌడ నాయక్ పేరు మీద మీ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులు అన్నీ చేస్తున్నారు. దత్త పుత్రుడు గౌడ నాయక్ పేరు మీద పొందిన సబ్సిడీలు ఎన్ని? ఏయే శాఖల నుంచి తీసుకున్నారు?. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ రానే లేదు. అగ్రికల్చర్ యునివర్సిటీ నుంచి దానికి 40 లక్షల రూపాయల కాంట్రాక్ట్‌ను దత్త పుత్రుడికే ఇప్పించుకున్నారు. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ ఎవరు మంజూరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా?. గౌడ నాయక్ కొన్నభూములు ఎలా కొన్నారు? కొన్న డబ్బు ఎక్కడిది? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
అంతకుముందు, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫాంహౌజ్ కట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో ఫాంహౌజ్ నిర్మించారని తెలిపారు. 80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. వీటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలన్నారు.
దీంతో, రంగంలోకి దిగిన మంత్రి నిరంజన్ రెడ్డి.. రఘునందన్‌కు సవాల్ విసిరారు. ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములను తాను కబ్జా చేశానని రఘునందన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా తనపై అభాండాలు వేయవద్దన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఎప్పుడైనా తన భూమి ఉన్న చోటకు వచ్చి చూసుకోవాలన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ కాల్వ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని మాట్లాడాలన్నారు. రఘునందన్ వస్తే తన భూములు సర్వే చేసి చూపిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment