న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. పంజాబ్‌లో ఉన్న ప్రభుత్వాన్ని సైతం పోగొట్టుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చలేకపోయిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కాంగ్రెస్‌పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని, అన్నా, చెల్లెళ్ల బ్రాండ్ విలువ కూడా తగ్గిపోయిందని విమర్శకులంటున్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రియాంకాగాంధీ యూపీ ఎన్నికల్లో ఎవరూ చేయనంత ప్రచారం చేశారు. మొత్తం 209 ర్యాలీలు, రోడ్ షోలలో ప్రసంగించారు. యూపీ మీదే ఆమె ఎక్కువగా కేంద్రీకరించినా, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్‌ల్లోనూ తిరిగారు. మహిళా సమస్యలవంటి ప్రధాన అంశాలపై ఫోకస్ చేసినా, తన సభలకు పెద్ద ఎత్తున ప్రజలను రప్పించగలిగినా, వారిని ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోయారు. ఇక రాహుల్‌గాంధీ సైతం ఐదు రాష్ట్రాల్లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. అయినా ఆయన మ్యాజిక్కేమీ పనిచేయలేదు. రాహుల్, ప్రియాంకాగాంధీలు పార్టీలోనూ విశ్వసనీయత కోల్పోతున్నారని, వైఫల్యానికి బాధ్యులను చేస్తూ తొందరల్లోనే సొంత పార్టీ నేతలే వారి మీద కత్తులు దూయడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
పంజాబ్‌లో దళితుడిని ముఖ్యమంత్రిని చేశామని చూపించే ప్రయత్నం చేశారు కానీ అది బెడిసికొట్టింది. ప్రియాంకా గాంధీ కష్టపడ్డారనడంలో సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ఆమె బాగా పనిచేశారు. ప్రధానమైన మహిళల సమస్యలను లేవనెత్తారు. అయినా రాజకీయాల్లో మ్యాజిక్కులంటూ ఉండవు, కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్‌కు అలాంటి టైమ్ నడుస్తోంది. రాజీకీయాలు ఒక్కరాడే ఆట కాదు, ఇది టీమ్‌గేమని గాంధీ కుటుంబం ఇప్పటికైనా తెలుసుకోవాలని, బలమైన నేతలను ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో పార్టీ విఫలమైందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓటమిపాలైన ప్రతిసారీ పార్టీలో అసమ్మతిరాగాలు పెరుగుతాయి. అలా గొంతెత్తిన వారిని తగ్గించే ప్రయత్నమూ జరుగుతుంది. అదే సమస్యకు అసలు కారణం. రాష్ట్రాల్లో స్థానిక నాయకులకు ప్రోత్సాహం పెరగాలి. జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సచిన్ పైలట్‌వంటి నేతలను కొత్తనాయకత్వంగా చూపించే ప్రయత్నం చేయాలి. కానీ కాంగ్రెస్ అందులో విఫలమైంది. గతంలో కాంగ్రెస్‌కు రాష్ట్రాల్లో నమ్మినబంట్ల వంటి రాజకీయ నాయకులున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు నేతలే దేశం మొత్తాన్ని సమీకరించాలనుకున్నారు. ఇక్కడే అన్నాచెల్లెళ్లు విఫలమయ్యారంటున్నారు విశ్లేషకులు.
మీమ్స్ అండ్ జోక్స్..
ఐదు రాష్ట్రాల్లో ఓటమితో కాంగ్రెస్‌పై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరలవుతున్నాయి. రాహుల్‌గాంధీ, నవజ్యోజోత్‌సింగ్‌సిద్ధూలపై జోకులు పేలుతున్నాయి. ‘కాంగ్రెస్‌కు మరో ఆప్షన్ లేదు. గాంధీ ఫ్యామిలీని వదిలేసి.. కొత్త నాయకత్వంతో ముందుకు రావాలి. లేదంటే పార్టీపనైపోయినట్టేనని ఈ ఎన్నికల ఫలితాలు సందేశమిస్తున్నాయి’ అని ఫిల్మ్ మేకర్ మనీష్ ముంద్రా ట్వీట్ చేశారు. ఇక రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందంటూ పలువురు ట్వీట్స్ చేశారు. ‘రాహుల్ గాంధీ బ్రేక్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఇక కాలమిస్ట్, రచయిత ఆనంద్ రంగనాథన్ అయితే ఏకంగా ఫ్లైట్ అనౌన్స్‌మెంట్‌ను అనుకరిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శించాడు. పంజాబ్‌లో పార్టీ ఓటమికి కారణమయ్యారంటూ మాజీ క్రికెటర్ సిద్ధూపైనా నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. పంజాబ్ ఎగ్జిట్‌పోల్స్ చూడగానే సిద్ధూకి కపిల్ శర్మ ఫోన్ కాల్ వస్తుందని, తనకూ పోటీ వస్తున్నందున అర్చనా పురాణ్ శర్మ జాగ్రత్తగా ఉండాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment