జైపూర్: ఫోన్ ట్యాపింగ్ అంశం గతేడాది రాజస్తాన్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే ఆరోణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవి నిజమని నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు సీఎం అశోక్ గహ్లోత్. ఈ క్రమంలో తాజాగా తాము ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించిది గహ్లోత్ సర్కార్. ఈ విషయాన్ని రాజస్తాన్ అసెంబ్లీ వెబ్‌సైట్‌లో చేర్చింది. సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కాళిచరణ్ షరఫ్ గతేడాది అడిగిన ప్రశ్నకు బదులుగా రాజస్తాన్ అసెంబ్లీ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
‘‘ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమేనా..ఒకవేళ నిజమే అయితే ఏ చట్టం కింద, ఎవరి ఆదేశాల మేరకు ట్యాప్ చేశారు. ఈ వివరాలను అసెంబ్లీ టేబుల్ మీద పెట్టండి’’ అని బీజేపీ ఎమ్మెల్యే కాళిచరణ్ షరాఫ్ ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ‘‘ప్రజా ప్రయోజనార్థం, ప్రజల భద్రత కోసం... శాంతి భద్రతలకు భంగం కలిగించగల నేరాలను అడ్డుకునేందుకు టెలీఫోన్లను నియంత్రించడం జరిగింది. భారత టెలీగ్రాఫ్ చట్టం-1885లోని సెక్షన్ 5(2), భారత టెలీగ్రాఫ్ సవరణ చట్టం 2007, ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69 కింద సంబంధిత అధికారి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది’’ అని ప్రభుత్వం వెల్లడించింది. సంబంధిత అధికారి నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే పై చట్టాల కింద రాజస్తాన్ పోలీసులు టెలీఫోన్లను నియంత్రించారంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఏయే నంబర్లతో ఉన్న ఫోన్లను ఇంటర్‌సెప్ట్ చేశారు.. ఎప్పుడు వాటిపై నిఘా పెట్టారు అనే వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించ లేదు. ప్రభుత్వం సమాధానం సరిగా లేకపోవడంతో సీఎం గహ్లోత్‌ని ఉద్దేశించి రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా ట్విటర్లో విరుచుకుపడ్డారు. తన సొంత పార్టీ నేతలపైనే గహ్లోత్ కుట్రపన్నారంటూ మండి పడ్డారు. గాంధీవాదం ముసుగు వేసుకుని ప్రజాస్వామం కోసం మొసలి కన్నీరు కార్చుతున్నారంటూ సతీశ్ ఎద్దేవా చేశారు.
గహ్లోత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అంగీకిరంచడంతో ప్రస్తుతం అందరి దృష్టి సచిన్ పైలట్ మీదనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిజమని తెలితే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని గతంలో గహ్లోత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు సచిన్ పైలట్ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారా.. లేక మన్నించి వదిలేస్తారా అనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సచిన్ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూశాకే మేము దీనిపై నిర్ణయం తీసుకుంటాము’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment