రజనీ పాత్రల వేషధారణలో అభిమానుల సందడి
రజనీకాంత్ కోసం 28 ఏళ్లుగా ఓటువేయకుండా ఒక వీరాభిమాని వేచిచూస్తున్నాడు. రజనీకాంత్‌కే తన తొలి ఓటును వేస్తానని చెబుతున్నాడు. పుదుకోట్టైకి చెందిన మహేంద్రన్‌కు 28 ఏళ్ల క్రితం ఓటు హక్కు వచ్చింది. అయితే రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆనాటి నుంచి ఎదురుచూస్తున్నాడు. తన తొలి ఓటును రజనీకే వేస్తానని ఇప్పటి వరకు 15 ఎన్నికలను బహిష్కరించాడు. ఇపుడు రజనీ పార్టీ పెట్టబోతున్నాడని తెలుసుకుని ఉబ్బితబ్బియిపోతూ తొలిసారిగా ఓటు వేసేందుకు తహతహలాడుతున్నాడు.
సాక్షి, చెన్నై: నటుడు రజనీకాంత్ 71 పుట్టినరోజును ఆయన అభిమానులు, మక్కల్ మన్రం నిర్వాహకులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరుపుకున్నారు. అనేక చోట్ల సంక్షేమ, సహాయ కార్యక్రమాలను నిర్వహించారు. రాజకీయ పార్టీ స్థాపనపై రజనీ ఈనెలాఖరులో ప్రకటన చేయనున్న దృష్ట్యా ఆయన అభిమానులు ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నారు. రజనీ రావాలి, పార్టీ పెట్టాలి, ఘన విజయం సాధించాలి వంటి అనేక చిత్ర విచిత్రమైన నినాదాలతో కూడిన రజనీ పోస్టర్లతో గోడలన్నీ నిండిపోయాయి. పుట్టిన రోజున చెన్నైలోని తన ఇంటిలో ఉండకుండా రుషీకేశ్, హిమాలయాలకు వెళ్లడం లేదా బెంగళూరులోని స్నేహితులతో గడపడం రజనీకి అలవాటు. పొంగల్, దీపావళి పండుగ రోజుల్లో మాత్రమే ఇంటి నుంచి వెలుపలికి వచ్చి అభిమానులను కలుసుకోవడం జరుగుతోంది. గత ఏడాది చెన్నైలోనే ఉండి కేళంబాక్కంలోని తన ఫాంహౌస్‌లో కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేశారు. చదవండి: (రజనీ పార్టీ చిహ్నంగా సైకిల్ గుర్తు!?)
రజనీ బొమ్మ టీషర్టులతో అభిమానులు
అయితే ఈ ఏడాది రాజకీయపార్టీని స్థాపించబోతున్న తరుణంలో తమను కలుసుకుంటారనే ఆశతో పెద్ద సంఖ్యలో అభిమానులు శుక్రవారం రాత్రి నుంచే ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఆయన ఇంటి ముందే కేక్ కట్ చేసి సంబరం చేసుకుంటూ శుభాకాంక్షల నినాదాలు చేశారు. అదే సమయంలో రజనీ సైతం ఇంటిలోపల కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి కేళంబాక్కంలోని ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు.. సినిమాల్లో రజనీ ధరించిన పాత్రలను అనుకరిస్తూ కొందరు అభిమానులు వేషాలు వేసుకుని వచ్చారు. పార్టీ పేరును ప్రకటిస్తారని కూడా ఎదురుచూసి ఎంతకూ ఆయన రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఈనెల 14న చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకుని 15వ తేదీ నుంచి ఆర్‌ఎఫ్‌సీలో ‘అన్నాత్త’ షూటింగ్‌లో పాల్గొంటారు. గతంలో 40 శాతం షూటింగ్ పూర్తికాగా, తాజా షెడ్యూల్‌లో రజనీ ఒకే సారి తన పాత్ర షూటింగ్ ముగిస్తారని తెలుస్తోంది. చదవండి: (ఢిల్లీలో తిష్ట వేసిన రజనీకాంత్..)
ప్రధాని మోదీ శుభాకాంక్షలు:
రజనీ, ప్రధాని నరేంద్రమోదీ, సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, డీఎంకే అధ్యక్షులు స్టాలిన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇండియా హజ్ అసోసియేషన్ అధ్యక్షులు అబూబకర్ స్వయంగా రజనీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ రజనీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment