దేవుడంటే భయం లేదు. పాప భీతి అసలే లేదు. రావణాసురుడి పదితలలను కూల్చిన రాముడి విగ్రహం తలనే ఏకంగా నరికేశారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకునేందుకు యత్నించారు. దీనికి చారిత్రక నేపథ్యం కలిగిన రామతీర్థంలోని బోడికొండను వేదికగా చేసుకున్నారు. దానిని రాజకీయ లబ్ధికోసం ఆయుధంగా మలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా... పోలీసు ఉన్నతాధికారులపైనా... తుదకు స్వామీజీలపైనా వారు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో డిసెంబర్ 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులెవరో శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించారు. దానిని కాస్తా సీతమ్మవారి కొలనులో పడేసి పోయా రు. 29వ తేదీ ఉదయం 7.30గంటలకు ఆలయ పూజారి ఎప్పటిలానే స్వామివారికి నిత్య కైంకర్యాల కోసం వెళ్లారు. ఆలయం తలుపులు తెలిచి ఉండటం చూసి కంగారు పడి లోపలికి వెళ్లకుండానే గర్భగుడి పైపు చూడగా శ్రీరాముడి విగ్రహం మొండెం మాత్రమే కనిపించింది. వెంటనే ప్రధాన ఆలయంలోని పూజారులకు విషయం తెలియజేశారు. ఉదయం 7.30 గంటల సమయంలోనే దుర్ఘటనను గుర్తించిన పూజారులు 10.30 గంటల వరకూ గుట్టుగా ఉంచారు. పూజారుల్లోనే కొందరు ఎట్టకేలకు సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారు. ప్రజలకు విషయం తెలిసిన తరువాత గానీ వారు పోలీసులను ఆశ్రయించలేదు. సాధారణంగా ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే ఈ కొండపై పూజారులుంటారు. ఆ తరువాత సందర్శకులు కొండపైకి వెళ్లినా గుడి బయటి నుంచే దర్శనం చేసుకుంటారు.
నిఘా లేదని నమ్మకంతోనే...
రాత్రయితే అక్కడ ఎలాంటి నిఘా ఉండదు. అందుకే దుండగులు ఆ సమయాన్ని ఎంచుకున్నారు. కొండపైకి వారు వెళ్లినపుడు సెల్‌ఫోన్ కూడా తమ వెంట తీసుకెళ్లకుండా జాగ్ర త్త పడ్డారు. సెల్‌ఫోన్ తీసుకువెళ్లి ఉంటే ఆ సమయంలో ఏ నెట్ వర్క్ టవర్ నుంచి సిగ్నల్స్ వచ్చాయో కనిపెట్టడం పోలీసులకు సులభమవుతుంది. ఖండించిన శిరస్సును దేవాల యం నుంచి వెలుపలికి తెచ్చి సీతమ్మకొలనులో పడేయడం చూస్తే విషయం పెద్దది చేయాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. కేవలం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను పాడుచేయాలని, పట్టా పంపిణీ కార్యక్రమం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని, హిందుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమనీ జనాన్ని నమ్మించేందుకు ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు.
వెంటనే స్పందించిన ప్రభుత్వం
బోడికొండ ఘటనపై దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్న రా ష్ట్ర ప్రభుత్వం డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్‌జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది. ఆలయానికి విద్యుత్ సౌకర్యం వచ్చిందని, సీసీ కెమెరాలు పెడుతున్నారని తెలుసుకుని మరీ దుండగులు ముందుగానే తమ కుట్రను అమలు చేస్తున్నారన్న అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఆరా తీస్తున్నారు. గైడ్లమని చెప్పుకుని తిరిగే ఇద్దరు యువకులను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. మరో ఇద్దరు టీడీపీ గ్రామస్థాయి నాయకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆలయాల పరిరక్షణకు సర్కారు చర్యలు
ఈ సంఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 571 ఆలయాలు ఉన్నాయి. దేవదాయశాఖ ఆధీనంలో సుమారు 10 వేల ఎకరాల భూములున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో ధూపదీప నైవేద్యాలకు 57 ఆలయాలకు మాత్రమే నిధులందేవి. అర్చకులెవరికీ కనీస వేతనాలు ఇచ్చేవారు కాదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అర్చక వెల్ఫేర్ ఫండ్ నుంచి ధూపదీప నైవేద్యాల కోసం సుమారు 250 మంది పూజారులకు నెలకు రూ.5వేలు నుంచి రూ.10వేల వరకూ ఇస్తూ ఆలయాలకు మళ్లీ జీవం పోస్తున్నారు. కరోనా సమయంలోనూ పూజారులకు రూ.5 వేలు చొప్పున సాయం అందించారు. అధికారంలోకి రాగానే ఆలయాల్లో దీపం వెలిగించారు. అర్చ కుల ఆకలి తీర్చి ఆదుకున్నారు. దేవాలయాల భద్రత కోసం ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రామతీర్ధంలోనూ అడుగడుగునా సీసీ కెమెరాలు పెట్టి, కొండపైన ఒకటి రెండు రోజుల్లో అమర్చడానికి సిద్ధం చేశారు.
రాజకీయ లబ్ధికోసం ఆందోళనలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలు ప్రజల్లో టీడీపీపై ఏహ్య భావాన్ని కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ అధికారులపైనా టీడీపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. స్వామీజీలు, హిందూ ధర్మ సంస్థలపైనా దుర్భాషలాడుతున్న ఆ పార్టీ నేతల్లో దేవుడిపై భక్తి కంటే రాజకీయ స్వలాభమే ఎక్కువగా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దుర్ఘటన జరిగిన రోజే టీడీపీ ముఖ్య నేతలు జిల్లాలో వాలిపోయారు. మరునాడు మరోనేత వచ్చి పిచ్చివాడిలా అందరినీ తిట్టేసి వెళ్లిపోయారు. ఇప్పడు ఏకంగా టీడీపీ జాతీయాధ్యక్షుడైన చంద్రబాబు నాయుడే దిగుతున్నారు. ముందే అనుకున్నట్లుగా, చాలా వేగంగా స్పందిస్తున్న తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది.
ఎన్నికల తరువాత ఏనాడూ జిల్లా ప్రజల బాగోగులు చూడని, ఒక్కసారి కూడా జిల్లాలో అడుగుపెట్టని చంద్రబాబు శనివారం రామతీర్థంలో పర్యటించి మరో డ్రామాకు తెరతీస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం ఆందోళన చేస్తున్న బీజేపీ నేత కూడా గతంలో టీడీపీలోనే ఉండేవారు. ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ నిరసన తెలుపుతుండటం, జిల్లా బీజేపీ నేతలెవరూ నాయకత్వం వహించకుండా కేవలం శిబిరాన్ని సందర్శించడానికే పరిమితమవ్వడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక ప్రతిపక్షానికి చెందిన ‘పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్’ హస్తం ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.
దర్యాప్తునకు అవరోధం
జరిగిన సంఘటనను నాయకులుతమ రాజకీయ లబ్ధికే వాడుకుంటూ దర్యాప్తునకు అవరోధంగా మారుతున్నారని పోలీసులే అంటున్నారు. టీడీపీకి చెందిన కొందరి కుట్ర ఇందులో ఉన్నట్టు తాము ఇప్పటికే నిర్ధారణకు వచ్చామని, బలమైన సాక్ష్యాలను సేకరించి త్వరలోనే నిందితులను బయటపెడతామని చెబుతున్నారు. కొండపై గల కోదండరామ స్వామి దేవాలయాన్ని జిల్లా ఎస్పీ సంఘటన జరిగిన రోజునే గాకుండా శుక్రవారం కూడా వెళ్లి, నేరం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఆందోళనలవల్ల అడుగుపడట్లేదు
బోడికొండ సంఘటనపై రాజకీయ పార్టీల లబ్ధికోసం ధర్నాలు చేస్తుండటం వల్ల దర్యాప్తునకు విఘాతం కలుగుతోంది. గత ప్రభుత్వంలో కూడా రోడ్ల విస్తరణ సందర్భంలో అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఇటువంటి సున్నిత అంశాలపై ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం వల్ల దర్యాప్తునకు ఇబ్బందిగా ఉంది. ధర్నాలు, నిరసనల బందోబస్తుకే విలువైన సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ చర్యను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించింది. సంఘటనపై సమగ్రమైన దర్యాప్తు ఇప్పటికే చేపట్టింది. ఛేదించేందుకు అయిదు ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి.
– బి.రాజకుమారి, జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment