సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈసారి ఎన్నికల్లో భారీ స్థాయిలో బంధువులు బరిలో నిలిచారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు, మామ అళ్లుల్లు ఇలా ఏదో ఒక రకంగా బంధుత‍్వాన్ని పంచుకున్నవారు ఎన్నికల్లో పోటీకి నిలిచారు. వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..?
మామా అల్లుడు..
మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్ తరుపున పోటీ చేశారు. ఇక మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.
కోమటి రెడ్డి బ్రదర్స్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ ఘనవిజయం సాధించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరుపున కోమటి రెడ్డి బ్రదర్స్ పోటీ చేశారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 21 వేల మెజార్టీతో గెలుపును ఖాయం చేసుకున్నారు. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో 54 వేలకు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు.
తండ్రి కోడుకులు..
మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మైనంపల్లి రోహిత్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఓటమి దిశలో ఉన్నారు.
అత్త.. అల్లుడు..
వేముల ప్రశాంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ తరుపున బాల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాడు. ఫలితాల్లో గెలుపు దిశగా దూసుకుపోతూ దాదాపుగా విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇదే స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి మేనత్త అన్నపూర్ణమ్మ ఓడిపోయింది.
ఎర్రబెల్లి బ్రదర్స్..
వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్ బీజేపీ తరుపున పోటీలో నిలిచారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరుపున బరిలో ఉన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో ఇద్దరు ఓటమి పాలయ్యారు.
గడ్డం సోదరులు..
సోదరులు గడ్డం వినోద్, గడ్డం వివేక్ విజయం సాధించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగారు. ఆయన సోదురుడు వివేక్ చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. ఇద్దరు విజయం సాధించడం గమనార్హం.
కేసీఆర్.. కేటీఆర్..
తండ్రికొడుకులు సీఎం కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ రెండు స్థానాల్లో పోటీలో నిలవగా ఆయన కుమారుడు కేటీఆర్ సిరిసిల్లలో బరిలోకి దిగారు. కామారెడ్డిలో ఓటమి పాలైన కేసీఆర్ గజ్వేల్ మాత్రం విజయం సాధించారు. అటు.. సిరిసిల్లలో కేటీఆర్ అధికారాన్ని కాపాడుకోగలిగారు.
భార్యాభర్తలు..
తెలంగాణ ఎన్నికల్లో భార్యభర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి భారీ విజయాన్ని అందుకున్నారు. హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పోటీలో నిలిచిన ఆయన భార్య పద్మావతి రెడ్డి ఘనవిజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment